ఇంగ్లాండ్ ఘన విజయం

Telugu Lo Computer
0


ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 278 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరో రోజు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిన్న మూడో రోజు ఇంగ్లండ్‌పై పైచేయి సాధించిన భారత జట్టు నేడు నాలుగో రోజు ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోయింది. 215/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు వికెట్లను టపటపా రాల్చుకుంది. సెంచరీ చేయడం ఖాయమని భావించిన పుజారా 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అవుటయ్యాడు. అది మొదలు వికెట్ల ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసి ఊపులో ఉన్నట్టు కనిపించిన కెప్టెన్ కోహ్లీ (55) అవుట్‌తో భారత జట్టు ఓటమి ఖాయమైంది. రహానే (10), రిషభ్ పంత్ (1), షమీ (6), ఇషాంత్ శర్మ (2), సిరాజ్ (0) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. రవీంద్ర జడేజా మాత్రం కాసేపు పోరాడాడు. క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. ఇక, ఆతిథ్య ఇంగ్లిష్ బౌలర్లలో ఒల్లీ రాబిన్సన్ ఐదు వికెట్లతో భారత టాపార్డర్‌ను కకావికలం చేయగా, ఓవెర్టన్ మూడు వికెట్లతో మిగతా పని పూర్తి చేశాడు. అండర్సన్, మొయీన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)