పారిస్ కమ్యూన్ గురించి....

Telugu Lo Computer
0

 


'కమ్యూనిస్టు లీగ్' మార్క్స్ ఎంగెల్స్ లను మనం సాధించాలానుకుంటున్న సమాజం ఎలావుండాలో చెబుతూ ఒక ప్రణాళిక రాయమంది. 1848 లో 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' లో వారిరువురూ కమ్యూనిస్టు సమాజం ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో చాలా ఉద్వేగంగా మార్గ దర్శనం చేశారు.

అది నిజమేనా? నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా? అన్న సందేహాలు బోలెడు. ఎందుకంటే అప్పటిదాకా నడిచిన చరిత్రంతా వర్గపోరాటాల చరిత్ర కదా మరి? 

ఇరవై మూడేళ్ళకు పారిస్ అనే ప్రయోగశాలలో తమ సిద్ధాంతానికి తొలి రుజువులు దొరికాయ్! ఇంక పరవాలేదు, ఈ తల్లకిందుల అమానవీయ ప్రపంచాన్ని మార్చడానికి తమ సిద్ధాంతం భేషుగ్గా పనికొస్తుందని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

అందుకే దాన్ని, చాలా ఉత్సాహంగా, "మానవజాతి నంతా, వర్గాల సమాజం నుండి, శాశ్వితంగా విముక్తం చేసే మహత్తర సామాజిక విప్లవ ఉషోదయం" గా ఎలుగెత్తి మరీ ప్రకటించారు!

ప్రయోగం విజయవంతం కాకపోయినా ఫలితాలపరంగా చూసినప్పుడు అవి తాము అనుకున్న రీతిలోనే వున్నాయనుకున్నప్పుడు ఒక శాస్త్రవేత్త ఎంత భావోద్వేగానికి గురౌతాడో మార్క్స్, ఎంగెల్స్ లు అనే ఇరువురు సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఇంచుమించు అలానే  ఫీలయ్యారు.

"కార్మిక విముక్తి కి వినూత్న మార్గం లభించింది" అంటూ పొంగిపోయాడు మార్క్స్!

నిజానికి 'పారిస్ కమ్యూన్' డెబ్బై రెండురోజులు బతికి బట్టకట్టింది. కానీ ఆ 72 రోజుల్లోనే(1871 మార్చ్ 18 నుంచీ మే 28 వరకూ) అది ఏం చేసిందో చూస్తే, కమ్యూనిస్టు సమాజం ఏర్పడితే, మౌలికంగా ఏ మార్పులు వుంటాయ్ అనే విషయాలు తెలుసు కోవాలనుకునే వారికి ఆసక్తికరంగా  ఉంటుంది. 

72 రోజుల్లో పారిస్ కమ్యూన్ ఏం చేసిందో చూడండి!

ప్రజాప్రతినిధుల్లో ఎవరైనా మెజారిటీ ప్రజల విశ్వాసం కోల్పోతే ఆ ప్రతినిధి తన పాలనాధికారం కోల్పోతాడు.

పాత సైన్యం రద్దు చేసి జాతీయ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసింది.

ఆర్థిక, ఆహార, పౌర రక్షణ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 10 కమీషన్ల ఏర్పాటు

రాజ్యం నుంచి చర్చిని వేరు చేశారు. చర్చి ఆస్తి జాతీయ ఆస్తి. ప్రభుత్వం మత సంస్థలకు డబ్బు ఇవ్వడం ఉండదు.

జనన,మరణ, వివాహ రిజిస్ట్రేషన్ లు  మత సంస్థలు చేయడం రద్దు.

పాఠశాలల్లో మత బోధన రద్దు.

మహిళా ఆధ్వర్యంలో మహిళా సైనిక దళం ఏర్పాటు

పారిపోయిన ఫ్యాక్టరీ యజమానుల స్థానే కార్మికులు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు.

యజమానులు వేసే అన్ని జరిమానాలు రద్దు.

తాకట్టు లో ఉన్నవాటిని ఉచితంగానే వెనక్కి తెచ్చుకునే అవకాశం.

ఇళ్ళ అద్దెల చెల్లింపు లకు గడువుపెంపు

మురికివాడల్లో నివసించిన వారికి ధనవంతుల ఇళ్లలో కొన్ని భాగాల కేటాయింపు.

ఉచిత, నిర్భంధ విద్య

పారిపోయిన ధనవంతుల ఇళ్ళలో పాఠశాలల ఏర్పాట్లు.

మహిళా కార్మికుల పనిస్థలాల్లో వారి శిశువులకు ఏర్పాట్లు.

బేకరీల్లో రాత్రిపూట పని రద్దు.

నిర్బంధంగా సైన్యం లో చేర్చుకోవడం రద్దు.

కమ్యూన్ లో ఏ ఒక్కరి జీతం 6 వేల ఫ్రాంకులు దాటకూడదన్న నియమం.

గిలిటెన్ ని కాల్చి వేశారు.

వెండోమ్ అనే విజయ స్థంభం కూల్చివేశారు.

పాప పరిహార కట్టడం కూల్చివేత.

కమ్యూన్ లో ఓ విదేశీయుడికి చోటు! ( ప్రపంచ కార్మికులు అంతా ఒకటే!)

జైళ్లలో మగ్గే నిరపరాధుల విడుదల.

మరణ శిక్షలు రద్దు.

ఇంకా యెన్నో చేశారు. ఎన్నో చేయాలని తలపెట్టారు.

1867 లో జర్మన్ భాషలో కాపిటల్ వచ్చింది. 1872 లో ఫ్రెంచ్ అనువాదం వచ్చింది. (పారిస్ కమ్యూన్ ఏర్పడింది 1871 మార్చ్ చివర్లో) పారిస్ కమ్యూన్ విప్లవంలో ఉన్నవారికి కాపిటల్ ఎందరికి తెలిసో కూడా సందేహమే! 

అసలు విప్లవకారులు బ్లాంకీ గానీ, రిగాల్ట్ గానీ, వార్లేన్ గానీ, లూసీ మిషెల్ గానీ ఏ ఒక్కరూ సోషలిస్టు భావాలకి మించి ఎదగనివారు. అయినా యెంతో గొప్ప నిబద్ధతతో ప్రాణాలను ఫణంగా పెట్టి తాము చేయగలిగినదంతా చేశారు. 

చుట్టూ జర్మన్ సేనలు తోడేళ్ళలా పొంచివున్నా, స్వదేశీసేనలు నిరంతరం ఈ 'భయంకరమైన' మార్పుల్ని ఏవగించుకుంటూ జీర్ణంచేసుకోలేక దాడులు చేస్తున్నా మానవజాతి అసలెలా బతకాలో, కొంచెం ఇతర మనుషుల పట్ల రవ్వంత సానుభూతి వున్నా ఈ ప్రపంచాన్ని ఎలా నందనవనం చేసుకోవచ్చో కేవలం 72 రోజుల్లోనే ప్రపంచానికి చాటి చెప్పింది ఈ పారిస్ కమ్యూన్ అనే ప్రయోగం!

మనిషి నమ్మకం వమ్ము కాదు! మార్క్స్ ఎంగెల్స్ ల శాస్త్రీయ భావనలు వమ్ముకావు! ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా, ఇంత నీచంగా తోటివాణ్ణి వేధిస్తూ, వారి శ్రమ మీద పడి కశ్మలాన్ని కతకడం చాలా జుగుప్స కలిగించే విషయమనీ, రోత పుట్టే వ్యవహారం అనీ ఎప్పటికైనా  తన శ్రమ మీద తాను బతకడమొక్కటే మనిషనే వాడికి మిగిలే ఏకైక తాత్విక సూత్రం అని పారిస్ కమ్యూన్ చాలా ధృడంగానే సందేశాన్నిచ్చింది.

దీనికోసం 30 వేలమంది ప్రాణాల్ని శత్రువు కిచ్చింది. 40 వేలమంది జైళ్లలో బందీలై చిత్రహింసలు అనుభవించారు. 650 మంది పసి కూనలు అరెస్టయ్యారు.

పారిస్ కమ్యూన్ ఏం చెప్పింది? మనిషి ఇంకా తనతోనే తోడుతెచ్చుకుంటున్న ఒక అమానుష ప్రవృత్తి, అదే, 'ఇతరుల శ్రమని దోచుకు తినిబతికే'  ఒక అమానవీయ ప్రవృత్తి నుంచి కచ్చితంగా వదిలించుకుని బతికే రోజు వస్తుందని రూఢిగా చెప్పింది! ఒక సత్యాన్ని నిబ్బరంగా ప్రకటించింది! అందుకు మనమేం చెయ్యాలో చెప్పింది! తను మరణిస్తూ ఈ నిజాన్ని బతికించుకొనే మార్గం చెప్పి నిష్క్రమించింది!

అందుకే పారిస్ కమ్యూన్ ఒక మహత్తర సామాజిక విప్లవ ఉషోదయం!

Post a Comment

0Comments

Post a Comment (0)