నిత్య చైతన్య స్ఫూర్తి

Telugu Lo Computer
0

 


కమ్యూనిస్ట్‌ ఉద్యమం - నిర్మాణంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. స్పష్టమైన మార్క్సిస్టు సిద్ధాంత అవగాహన, నిరంతరం ప్రజల్లో కలిసివారి పక్షం నిలబడటం, అంతర్జాతీయ అంశాలపై అవగాహన, వర్గ దృక్పథం, భావజాల వ్యాప్తి, పార్లమెంటరీ - పార్లమెంటేతర రంగాల్లో విప్లవాత్మక కృషి - భూస్వామ్య పెత్తందార్లుపైన, పెట్టుబడిదారీ వర్గంపైన నిరంతర వర్గపోరాటం, క్రూర నిర్బంధాన్ని తట్టుకొని నిలబడటం, పార్టీ క్యాడర్‌కు అండగా ఉండటం... పత్రికలు, పుస్తక ప్రచురణల ద్వారా సైద్ధాంతిక అవగాహన, ఆలోచన, చైతన్యం కార్యకర్తల్లో కల్పించడం.. ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం, నాయకత్వం లక్షణాలు. ఆదర్శంగా - నిరాడంబరత కలిగి ఉండటం చాలా చాలా అవసరం. ఇవన్నీ ఒకే చోట కలగలిసిన గొప్ప విప్లవయోధుడు కామ్రేడ్‌ మోటూరి హనుమంతరావు. (ఎం.హెచ్‌.)

1917 మే1న గుంటూరుజిల్లా రేపల్లె తాలూకాలోని ''వెల్లటూరు'' గ్రామంలో మోటూరు హనుమంతరావు జన్మించారు. 1937 నాటికే కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యులైయ్యారు. అదే ఏడాది కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలకి హాజరయ్యారు. చల్లపల్లిలో ఉదయంగార్ని వివాహం చేసుకొన్నారు. ఏ.సీ. కాలేజీలో చదువుకున్నారు. విద్యార్థి ఉద్యమం నిర్మించారు. బసవపున్నయ్య, లావు బాలగంగాధరరావు, వై.వి. కృష్ణారావులాంటి వారితో ఎమ్‌.హెచ్‌. కలసి పనిచేశారు. 1937-43 కాలంలో జిల్లా కమిటీలో, 1948-64 రాష్ట్ర కార్యదర్శి వర్గంలో, 1964 నుంచి మార్క్సిస్ట్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శిగా మోటూరు వ్యవహరించారు. నాటి ఉమ్మడి పార్టీలో సీపీఐ కేంద్ర కౌన్సిల్‌కు ఎన్నికైనారు. (1953లో) అదే సంవత్సరం విశాలాంధ్ర సంపాదకులైనారు. నాటి పార్టీ పత్రికైన ప్రజాశక్తి, విశాలాంధ్ర, జనత, జనశక్తి, ప్రజాశక్తి (దినపత్రిక 1981) లాంటి పత్రికలకు సంపాదకులై,  ఎందరో యువజర్నలిస్ట్‌లను ఆయన తీర్చిదిద్దారు. దాదాపు 32 గ్రంథాలు ఎమ్‌.హెచ్‌. రాశారు. మార్క్సిస్ట్‌ మహోపాధ్యాయులు, ఆంధ్రాలో అరుణపతాకం, స్టాలిన్‌ యుగం, దిగంబర కవిత్వం మార్క్సిజం కాదు, విశాలాంధ్రలో విషాధఛాయలు, రాబందుల రాజ్యం, రోజన్‌బర్గ్‌ దంపతులు, ప్రశ్నలూ - జవాబులు, మావో - హౌచిమెన్‌, ఛూటే విప్లవగాథలు... నాగయ్య లాంటి పుస్తకాలు.. అవి కార్యకర్తలకు, వామపక్ష శ్రేయోభిలాషులకు, సైద్ధాంతిక అవగాహన పెంచే గొప్ప ఆయుధాలు. ఆయన ఉపన్యాసాలు, సంపాదకీయాలు, శీర్షికలు కంచుకాగడా, ములుకులూ - పలుకులూ - తీరుతెన్నులు, చెణుకులు వ్యాఖ్యానాలూ, రాజకీయ విమర్శలు, ప్రత్యర్థులను సైతం ఆలోచింపచేసేవి. చాలా సూటిగా, పదునుగా ఉండేవి. మార్క్సిస్ట్‌పార్టీని మితవాద శక్తుల నుంచి, అతివాద పోకడల నుంచి.. కాంగ్రెస్‌ భూస్వామ్యశక్తుల నుంచి, కంటికి రెప్పలా కాపాడుకొన్న ఆయన కార్యదర్శకత్వం కొనయాడదగినది. ఇందిరమ్మ చీకటి ఎమర్జెన్సీలో ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళి పత్రికను, పార్టీని, క్యాడర్‌ను కాపాడినతీరు చైతన్యపూరితం, వీరోచితమైనదిగా చెప్పవచ్చు. కొల్లేటికోటలో, చల్లపల్లి ఎస్టేట్‌లో,  ఉయ్యూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో ఎమ్‌.హెచ్‌. ఉద్యోగాలు చేశారు. తొలి ఆంధ్ర కమ్యూనిస్ట్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పోలే పెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్యల వద్ద సోషలిస్ట్‌ సాహిత్యం తీసుకొని అధ్యయనం చేసిన ఎమ్‌.హెచ్‌.ను సామ్య రాసిన ''ఏబీసీ ఆఫ్‌ సోషలిజం'' బాగా ఆకర్షించింది. భాషా ప్రయుక్తరాష్ట్రం కోసం పోరాడిన వారిలో ప్రముఖులు ఎమ్‌.హెచ్‌. 1948లో ప్రజాశక్తి నిషేధం. 1949లో నూజివీడులో అరెస్ట్‌, ఆ తరువాత 62, 64 ప్రాంతాల్లో అరెస్ట్‌లు.. కడలూరు జైలు, చంచల్‌గూడ జైలులో డిటెన్యూగా నిర్భంధం.. 75 నుంచి అండర్‌ గ్రౌండ్‌ జీవితం.. ఆ రహస్య జీవితంలోనే (27.7.1968న) ప్రజాశక్తి పునరుద్ధరించడంలో ఎమ్‌.హెచ్‌.కృషి ఎంతో త్యాగమయమైనది. 1969, 72 ప్రాంతాల్లో జై ఆంధ్రా, జై తెలంగాణ లాంటి ఉద్యమాల కాలంలో సమైక్యతా సభలు ఏర్పాటు చేసారు ఎమ్‌.హెచ్‌. శ్రీశ్రీ హాజరైనారు. ఎమ్‌.హెచ్‌. రాసిన ''ఉగ్రవాదుల దివాళా కోరు రాజకీయాలు'' పుస్తకం వారిలోని సైద్ధాంతిక అవగాహనకు నిజమైన 'మార్క్సిస్ట్‌ - లెనినిస్ట్‌ - అవగాహనకు దిక్సూచిగా నిలుస్తుంది. అన్ని రకాలైన విచ్ఛిన్నాల నుంచి పార్టీని కాపాడిముందుకు నడిపించారు ఎమ్‌.హెచ్‌. అలనాటి చల్లపల్లి జమిందార్‌ వ్యతిరేక భూపోరాటాలు, 10వేల ఎకరాల బంజరు భూముల ఆక్రమణ పోరాటాలు, నూజివీడు, మునగాల, భూపోరాటాల్లో ఎమ్‌.హెచ్‌. పాత్ర నిత్యస్ఫూర్తివంతం. ఇక బ్రిటిష్‌వారి కాలంలోనే మద్రాస్‌ శాసనసభలో నాటి మంత్రి కల్లూరి చంద్రమౌళిపై గెలిచిన ఎమ్‌.హెచ్‌.. నాటి ముఖ్యమంత్రులు రాజాజీ, ప్రకాశం గార్లను ఎదుర్కొన్న తీరు.. జనపక్షంగా అసెంబ్లీ వేదికగా ఎమ్‌.హెచ్‌. మాట్లాడిన తీరు ప్రశంసనీయం... అలాగే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా ఎమ్‌.హెచ్‌. కృషి నేటి రాజకీయవేత్తలకు చక్కటి పాఠ్యాంశం. ఎక్కడున్నా పోరాటమే నిత్యపథం. నాటి డెంకల్‌ ప్రతిపాదనలకు - నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా స్పీకర్‌ వెల్‌ ముందుకు దూసుకెళ్ళిన పార్లమెంటరీయన్‌లలో ప్రథముల్లో మోటూరు ఒకరు. 1993-94 పార్లమెంటరీ ''పారిశ్రామిక స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌''గా అన్ని పార్టీల సభ్యుల ఆదరాభిమానాలు పొందారు. జీవితమంతా ప్రజా ఉద్యమాలకే ధారపోసిన ఆ మహామనిషి జూన్‌ 18, 2001న క(పె)న్ను మూశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)