కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ !

Telugu Lo Computer
0


ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మంత్రి కొండ సురేఖకు, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో మండిపడిన కేటీఆర్ తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే కోర్టుకు వెళతానని తనపైన చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ఎదుర్కొంటానని కేటీఆర్ వెల్లడించారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ లీగల్ నోటీసులు ఇస్తే భయపడేది లేదని, తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. కేటీఆర్ భయంతో దిగజారి మాట్లాడుతున్నారని, కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు. మంత్రి కొండా సురేఖ తో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి పై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పదే పదే తన పేరును ప్రస్తావించి కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇలా మాట్లాడే వారిపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే చెప్పిన కేటీఆర్ ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు రాస్తున్న కొన్ని మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానల్స్ కు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపైన అసత్యాలు ప్రచారం చేస్తే ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)