తైవాన్‌ ను వణికించిన పెను భూకంపం !

Telugu Lo Computer
0


తైవాన్‌లో పెను భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. తైవాన్ రాజధాని తైపే సమీపంలో ఈ ఉదయం భూమి ప్రకోపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. తైవాన్ ఉత్తర తీర ప్రాంతంలో ఉంటుందీ తైపే. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తైవాన్ దక్షిణ ప్రాంతంలోని హువాలియెన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 34 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రతకు హువాలియెన్ సిటీలో పలు భవనాలు బీటలు వారాయి. మరికొన్ని కూలిపోయాయి. రాజధాని తైపేలోనూ దీని తీవ్రత కనిపించింది. తైవాన్‌ పొరుగునే ఉన్న దక్షిణ జపాన్ ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్‌లపైనా పడింది. భూకంప తీవ్రతకు సముద్రంలో అలలు పోటెత్తాయి. మూడు నుంచి అయిదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. తైవాన్ సమీపంలో ఉన్న దక్షిణ జపాన్ ద్వీప సముదాయాలు అల్లాడిపోయాయి. యొనగుని, ఇషిగాకీ, తరమ, మియాకోజిమా ప్రీఫెక్షర్స్‌ తీరాల్లో అలలు పోటెత్తాయి. అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్లు జపాన్ న్యూస్ అవుట్‌లెట్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. సునామీ హెచ్చరికలను జారీ చేసినట్లు వివరించింది. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతం మొత్తాన్నీ అధికారులు ఖాళీ చేయించారు. పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం వంటి ఘటనలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)