మరో పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలని హైకోర్టులో పిల్ !

Telugu Lo Computer
0


మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని నవ్యాంధ్రకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు త్వరలోనే తీరిపోనుంది. దీంతో మరో పదేళ్లపాటు కామన్ కేపిటల్‌గా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2వ తేదీతో ముగుస్తున్నా, ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొన్నారు. అందువల్ల 2034 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందన్నారు. విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టి పెట్టకపోవడంతో వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడే అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని నిబంధనలు అమలు కానందున హైదరాబాద్ సిటీని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)