తెలంగాణలో టీ ఫైబర్ కు మోక్షం ?

Telugu Lo Computer
0


తెలంగాణ వ్యాప్తంగా ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలకు వేగవంతమైన ఇంటర్‌నెట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో తొమ్మిదేళ్ల క్రితం టి-ఫైబర్ అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అది మూలనపడటంతో ఇన్ని సంవత్సరాలుగా దానికి మోక్షం లభించలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిని సారించింది. 33 జిల్లాల్లోని 589 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీలు, 10,128 రెవెన్యూ గ్రామాల పరిధిలో 83.58 లక్షల మందికి ఇంటర్‌నెట్‌ అందనుంది. తొమ్మిదేళ్లు కావస్తున్నా సగం కూడా పూర్తికాని ఈ ప్రాజెక్టుకు నిధుల్లేక పనులు నిలిచిపోయాయి. సామాన్యులకూ ఐటీ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్ లో దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వినియోగించనున్నారు. అందుకు ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బడ్జెట్ లో ఐటీ శాఖకు ప్రభుత్వం రూ.774 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్ లో కేవలం రూ.362 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే సమయంలో మొత్తం రూ.4 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పథకానికి భారత్‌ నెట్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీ రామారావు 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌ కింద దీన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది ప్రజలకు టెలిమెడిసిన్, విద్య అవకాశాలను అందిస్తారు. ఆరోగ్యం, విద్యను మెరుగుపరుస్తారు. టీఫైబర్ ద్వారా గృహాలకు 4-100 ఎంబీపీఎస్, సంస్థలకు ఆన్-డిమాండ్ 20-100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ సరఫరా అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)