ఏ పార్టీని గెలిపించుకోవాలనేది ప్రజలకు బాగా తెలుసు !

Telugu Lo Computer
0


వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీని గెలిపించుకోవాలనేది ప్రజలకు బాగా తెలుసునని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఇప్పటికే ఈ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారని అన్నారు. పట్టణ ఓటర్లల్లో వైఎస్ఆర్సీపీపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. రోడ్లు బాగు చేయలేదనే అభిప్రాయం పట్టణ ఓటర్లల్లో బలంగా నాటుకుపోయిందని, ఇది వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత ఏర్పడటానికి ఓ కారణమని చెప్పారు. అర్బన్ ప్రాంతంలో చదువుకున్న వాళ్లు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందారనే నమ్మకంతో ఉన్నారని, వాళ్లందరూ తమకే ఓటు వేస్తారనే అభిప్రాయంతో ఉన్నారని ఉండవల్లి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదును బదిలీ చేసిన ప్రభుత్వం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదని వ్యాఖ్యానించారాయన. వైఎస్ జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మాత్రం ఈ సంక్షేమ పథకాలన్నీ గ్యారంటీగా రద్దయిపోతాయని ప్రజలకు తెలుసునని, అందుకే ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ఉండవల్లి అన్నారు. జగన్ కాకుండా ఏ పవన్ కల్యాణో ముఖ్యమంత్రి అయితే ప్రజలు నమ్మకం ఉంచే వారని, సంక్షేమ పథకాల అమలుకు చంద్రబాబు వ్యతిరేకి అనే చరిత్ర తెలుసు కాబట్టి ఆయన వస్తే ఖచ్చితంగా వాటన్నింటినీ రద్దు చేస్తాడని నమ్ముతున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువగా డబ్బులు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని జనం నమ్మట్లేదని ఉండవల్లి అన్నారు. ఉచితాల వల్ల ఏపీ దివాళా తీసిందని చెప్పిన చంద్రబాబే, అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతామని చెప్పడం వల్ల నమ్మకం కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోన్నది వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కాదని, జగనే స్వయంగా పోటీ చేస్తున్నట్టే లెక్క అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ గెలిచినా, ఓడినా దానికి జగనే పూర్తిగా బాధ్యుడవుతాడని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)