పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామా

Telugu Lo Computer
0


పంజాబ్‌ గవర్నర్‌, చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. బన్వరీలాల్‌ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా గవర్నర్‌ బన్వరీలాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌.. సీఎంకు పలుమార్లు లేఖలు రాశారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానంటూ గతేడాది ఆగస్టులో హెచ్చరించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారంటూ అటు మాన్‌ సర్కారు కూడా ఆరోపించింది. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య ప్రతిష్టంభన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై పంజాబ్‌ గవర్నర్‌ను ఉద్దేశిస్తూ.. 'మీరు నిప్పుతో ఆడుతున్నారు' అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బన్వరీలాల్‌ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)