వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు తథ్యం !

Telugu Lo Computer
0


శాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ లోక్‌సభలో మాట్లాడారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరిస్తే, దానిని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత వారంతా ప్రేక్షకుల సీట్లకే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి కోసమే వారు తీవ్రంగా కష్టపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''మహిళలు, యువత, పేదలు, రైతులపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. మైనారిటీల పేరిట ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయి. వారి తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. వారసత్వమే కాంగ్రెస్‌ దుకాణం మూసివేతకు కారణమవుతోంది. దానికి మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌ బాధితులయ్యారు'' అని విమర్శించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు, హోం మంత్రి అమిత్‌షాకు సొంత పార్టీలేమీ లేవని వ్యాఖ్యానించారు. భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని ఆరోపించారు.'' ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలుస్తూ భారతీయులకు నైపుణ్యం లేదన్నారు. అప్పుడే ఆయన మన శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదు. నెమ్మదిగా, సోమరుల్లా పని చేస్తారని అన్నారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేమీ కాదు. మనకి ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారు. వారిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చాం. నేను మూడోసారి ప్రధాని అయ్యాక దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తా. మేం సాధించిన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుంది. మూడో దఫాలో మేం వికసిత్‌ భారత్‌ లక్ష్యాల కోసం పని చేస్తాం'' అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు తథ్యమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేవలం భాజపాకే 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. మూడో విడత పాలనను వెయ్యేళ్ల పాటు గుర్తుంచుకునేలా పాలిస్తామన్నారు. ఇండియా కూటమి అలైన్‌మెంట్‌ దెబ్బతిందని ఎద్దేవా చేశారు. అందులో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదన్నారు. అలాంటప్పుడు ఆయా పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఎక్కువయ్యాయని గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)