కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా కష్టమే !

Telugu Lo Computer
0


శ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే స్థానాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. 300 సీట్లలో కనీసం 40 స్థానాలు కూడా గెలుస్తారో లేదో కూడా అనుమానమేనంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ''300 సీట్లలో పోటీ చేయమని కాంగ్రెస్‌కు చెప్పా. వాళ్లు వినలేదు. ఇప్పుడు ముస్లిం ఓటర్ల కోసం రాష్ట్రానికి (బెంగాల్) రెక్కలు కట్టుకుని వచ్చారు. 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తే కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందో లేదో అనుమానమే. ఇక్కడ రెండు సీట్లు (లోక్‌సభ) ఇస్తామని ఆఫర్ చేశాను. కానీ వాళ్లు మరిన్ని కావాలని అడిగారు. అప్పుడు ఒకే మాట చెప్పాను. 42 సీట్లలో పోటీ చేయమని అన్నాను. తోసిపుచ్చారు. అప్పట్నించి వాళ్లతో మాటలు జరిపిందే లేదు'' అని మమత తెలిపారు. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' కోసం పశ్చిమబెంగాల్‌లోకి కాంగ్రెస్ అడుగుపెట్టినా 'ఇండియా' కూటమి భాగస్వామిగా తనకు కనీస సమచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగం నుంచే తనకు ఆ విషయం తెలిసిన మమత చెప్పారు. ర్యాలీ సజావుగా సాగేలా చూడాలని డెరిక్ ఒబ్రెయిన్‌ను కోరారని, అలాంటప్పుడు బెంగాల్ రావాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీని గెలవాలని కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాలు విసిరారు. చేతనైతే గతంలో కోల్పోయిన వారణాసి నియోజకవర్గంలో బీజేపీని ఓడించాలన్నారు. ''మణిపూర్ మంటల్లో తగులబడుతున్నప్పుడు మీరెక్కడున్నారు? మేము ఒక టీమ్‌ను పంపాం. అక్కడ మహిళను వివస్త్రగా నడిపించారు. 200 చర్చిలు తగులబెట్టారు. ఇప్పుడు వాళ్లు టీ దుకాణాల దగ్గర ఫోటోషూట్స్‌లో పాల్గొంటున్నారు. వాళ్లు వలస పక్షులు'' అంటూ కాంగ్రెస్‌పై మమత నిప్పులు చెరిగారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)