2022లో 14 లక్షలకు పైగా కొత్తగా క్యాన్సర్‌ కేసులు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా 2022లో కొత్తగా క్యాన్సర్‌ కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అదే ఏడాదిలో ఈ వ్యాధి కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మొత్తం కేసుల్లో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ (1.92 లక్షలు)గా వెలుగుచూశాయి. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల కేసులు నమోదుకాగా, 97 లక్షల మరణాలు సంభవించాయి. భారత్‌లో పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ఎక్కువగా నమోదయ్యాయి. మహిళల విషయంలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌), అండాశయానికి సంబంధించినవి అధికంగా వెలుగు చూశాయి. అత్యధిక మరణాలకూ ఈ రకాలే కారణమైనట్లు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' అంచనా వేసింది. దేశంలో 75 ఏళ్లలోపు వారు ఈ వ్యాధి బారినపడే ప్రమాదం 10.6 శాతంగా తేలింది. మరణం ముప్పు 7.2 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇవి 20 శాతం, 9.6 శాతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో దీని బారినపడే అవకాశం ఉంది. తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల కొత్త కేసులకు, మరణాలకు ప్రధానంగా 10 రకాలే కారణమయ్యాయి. మొత్తం 185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్ల డేటాను 'ఐఏఆర్‌సీ' విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా సంభవించాయి. మొత్తం కొత్త కేసుల్లో ఇవే 12.4 శాతం (25 లక్షలు)గా ఉన్నాయి. మరణాల్లోనూ దీనిదే అత్యధికం (19 శాతం/ 18 లక్షలు). కొత్త కేసుల్లో 11.6 శాతం (23 లక్షలు)తో రెండో స్థానంలో రొమ్ము క్యాన్సర్‌ ఉంది. 'సర్వైకల్‌' ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల్లో ఈ రకానిది తొమ్మిదో స్థానం (3.48 లక్షలు). క్యాన్సర్, పాలియేటివ్ సంరక్షణ సేవలకు ప్రభుత్వాలు తగినంతగా ఆర్థిక తోడ్పాటు అందించడం లేదని డబ్ల్యూహెచ్‌వో ఆరోపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)