రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు 15 రైల్వేస్టేషన్ల ఎంపిక !

Telugu Lo Computer
0


సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో మొత్తం 15 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు డివిజన్‌ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు అవన్నీ. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్టేషన్లు కూడా ఈ డివిజన్‌ కిందికే వస్తాయి. వాటిన్నింటినీ 372.13 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే కొత్తగా నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న నైరుతి రైల్వే అధికారులు పూర్తి చేస్తోన్నారు. బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే బంగార్‌పేట, చెన్నపట్టణ, ధర్మపురి, దొడ్డబళ్లాపుర, హిందూపురం, హోసూరు, కెంగేరి, కృష్ణరాజపురం, కుప్పం, మల్లేశ్వరం, మాలూరు, మండ్య, రామనగర, తుంకూరు, వైట్ ఫీల్డ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయనుంది. చెన్నపట్టణ-శెట్టిహళ్లి, చిన్నకొత్తపల్లి-మక్కాజీ పల్లి-నాగసముద్రం స్టేషన్ల మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి, బెంగళూరు ఈస్ట్ స్టేషన్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)