బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయం !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశంలో భక్తుల కోసం ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. మహిళలు కోసం మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయిస్తామని చెప్పారు. హైందవ స్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు ఒక అమూల్యమైన కానుక అని చెప్పారు. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇక, ఈ సమావేశంలో స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం తెలిపారు. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం తెలిపారు. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించారు. 2024-25 లో హుండీ ఆదాయం రూ.1611 కోట్ల వస్తుందని అంచనాగా చూపించారు. బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా వేసారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు వస్తాయని అంచనాల్లో చూపించారు. దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనాగా నిర్ణయించారు. గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లుగా పేర్కొన్నారు. కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. రూ. 30 కోట్లతో గోగర్భం- ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)