ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించిన నారాయణమూర్తి !

Telugu Lo Computer
0


ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న నరేన్‌ కృష్ణ అనే యువ వ్యాపారవేత్తకు అనూహ్య అనుభవం ఎదురైంది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న అతడు తన పక్క సీట్లోనే ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కోటీశ్వరుడైన ఆయన ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో వెళ్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతలోనే తేరుకొని ఆయనతో మాట కలిపారు. విమానంలో వీరిద్దరూ చర్చించుకున్న పలు అంశాలను సామాజిక మాధ్యమం లింక్డిన్‌ వేదిగా పంచుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయం నారాయణమూర్తితో మాట్లాడిన తర్వాతే అర్థమైందని నరేన్‌ రాసుకొచ్చారు. '' విమానంలో ప్రయాణించిన కొన్ని గంటల్లోనే అసంఖ్యాకమైన విషయాలను చర్చించుకున్నాం. భవిష్యత్‌లో కృత్రిమ మేధ  ప్రభావం, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో యువత పాత్ర, ఆర్థికంగా చైనాను అధిగమించాలంటే ఎలాంటి చర్యలు అవసరం?ఒత్తిడిని తట్టుకోవడం ఎలా? ఓ సంస్థను నిర్వహిస్తున్నప్పుడు ఎదురయ్యే వైఫల్యాలను ఎలా అధిగమించాలి? ఇలా ఎన్నో అంశాలు మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఫలితాలతో సంబంధం లేకుండా మనవంతు ప్రయత్నం చేస్తే, విజయం దానంతటదే వస్తుందని నారాయణమూర్తి చెప్పారు. తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను నాతో పంచుకున్నారు. కృత్రిమమేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వివిధ రంగాల్లో ఉత్పాదకత 10 నుంచి 100 రెట్లు పెరుగుతుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరింత వేగంగా ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు'' అంటూ నరేన్‌ రాసుకొచ్చారు. 'మనసు పెట్టి పని చేస్తే.. ప్రతి అవకాశం అనుకూలంగా మారుతుంది' అని ఆయన చెప్పిన మాట తనను ఎంతో ఆలోచింపజేసిందన్నారు. అనుకోకుండా అంతటి గొప్ప వ్యక్తిని కలవడం జీవితంలో మర్చిపోలేనని నరేన్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)