అదానీ- హిండెన్‌బర్గ్‌ కేసు దర్యాప్తులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

Telugu Lo Computer
0


దానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులపై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయాలన్న వాదనలకు అర్థం లేదని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన 24 ఆరోపణల్లో 22 కేసుల్లో కేసు దర్యాప్తు పూర్తయ్యిందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతం రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిపై దర్యాప్తును మూడు నెల్లో పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు ఇచ్చింది. సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌లో కల్పించుకునేందుకు అధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగానే ఉంటుందని తెలిపారు. కోర్టు నియమించిన ప్యానెల్ సిఫారసుల ప్రకారం.. ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా.. హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా అదానీ గ్రూప్‌ తన కంపెనీ షేర్ల ధరలను కృత్రిమ పెంచిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్‌ దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాలి తివారి, ఎంఎల్‌ శర్మ, కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌, అనామికా జైశ్వాల్‌ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాతే ఆ కంపెనీ షేర్లు గణనీయంగా పతనమయ్యాయని పేర్కొన్నారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు వెలుగుచూడడం లేదని ఆరోపించారు. మరో వైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు పెరిగాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేర్లు బీఎస్‌ఈలో 17.83శాతం పెరిగాయి. ఎన్‌డీటీవీలో 11.39, అదానీ టోటల్ గ్యాస్‌లో 9.99 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 9.13 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 9.11 శాతం వృద్ధిని నమోదు చేశాయి అదానీ విల్మార్ షేర్లు 8.52 శాతం, అదానీ పవర్ 4.99 శాతం, అంబుజా సిమెంట్స్ 3.46 శాతం, ఏసీసీ 2.96 శాతం చొప్పున లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)