శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ ?

Telugu Lo Computer
0


తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పర్జా పాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. లబ్ధిదారుల నుంచి మొత్తం ఏకంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 19 లక్షల మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలకు రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న తరుణంలో రేషన్‌ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టిసారించింది. డూప్లికేట్‌ కార్డులను తొలగించి, అర్హులకు కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి  పరిశీలన అనంతరం కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. దరఖాస్తులు ఇవ్వని వారు.. గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం సూచించారు. ఇక ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా రాష్ట్రంలో లక్షకుపైగా రేషన్‌ కార్డులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క రేషన్‌ కార్డును కూడా రద్దు చేయలేడం లేదని తేల్చి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)