హజ్‌ కోటాపై భారత్‌-సౌదీ అరేబియా ఒప్పందం

Telugu Lo Computer
0


హజ్‌ కోటాపై భారత్‌-సౌదీ అరేబియా తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికిగాను భారత్‌ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించనుంది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌ తరఫున మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌.. సౌదీ తరఫున హజ్‌ మినిస్టర్‌ డాక్టర్‌ తౌఫిగ్‌ అల్‌ రబియా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కోటా ప్రకారం 1,40,020 సీట్లు హజ్‌ కమిటీ ద్వారా వెళ్లే వారికి కేటాయిస్తారు. 35,005 సీట్లు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి ఇవ్వనున్నారు. యాత్రికులకు కీలక సమాచారం అందించడంలో భారత్‌ చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమాలను సౌదీ బృందం అభినందించింది. వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం, యాత్రికుల శ్రేయస్సుకు పెద్దపీట వేయడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ చర్చల సందర్భంగా వారు చూపిన స్ఫూర్తి, సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు జెడ్డాలోని అబ్దులజీజ్‌ ఎయిర్‌ పోర్టులోని హజ్‌ టెర్మినల్‌ను సందర్శించారు. హజ్‌, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భారతీయుల కోసం సత్వర వీసా పరిష్కారం, అదనపు విమానాలు, రవాణాపరమైన సౌలభ్యం వంటి చర్యలు తీసుకొన్నట్లు ఇటీవల సౌదీ ప్రకటించింది. గత నెల భారత పర్యటనకు వచ్చిన తౌఫిగ్‌ అల్‌ రబియా పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత యాత్రికులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పలు కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఉమ్రా వీసాను 90 రోజులకు పొడిగించడం, పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నాలుగు రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)