ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు ఖర్చు !

Telugu Lo Computer
0

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది. వీటి జీవితకాలం 15 సంవత్సరాలుఉంటుందని, జమిలి ఎన్నికలు జరిగిన పక్షంలో ఒక్కో ఇవిఎం సెట్ తన జీవితకాలంలో మూడు ఎన్నికలకు మాత్రమే ఉపయోగపడగలదని కేంద్ర ప్రభుత్వానికి పంపిన నోట్‌లో ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం టుందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. జమిలి ఎన్నికలు జరిగితే ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒకటి లోక్‌సభ నియోజకవర్గానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి వంతున రెండు ఇవిఎంలు అవసరమవుతాయని ఇసి తెలిపింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ రోజుతోసహా వివిధ దశలలో పాత ఇవిఎంల స్థానంలో భర్తీ చేయడానికిఅదనంగా కొన్ని కంట్రోల్ యూనిట్లు(సియు), బ్యాలట్ యూనిట్లు (బియు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వివిప్యాట్) అవసరమవుతాయని ఇసి వివరించింది. ఒక్కో ఇవిఎంకు ఒక బియు, ఒక సియు, ఒక వివిప్యాట్ సెట్‌గా ఉంటాయి. జమిలి ఎన్నికల కోసం కనీసం 46,75,100 బియులు, 33,63,300 సియులు, 36,62,600 వివిప్యాట్లు అవసరమవుతాయని గత ఏడాది ఫిబ్రవరిలో న్యాయ మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో ఇసి పేర్కొంది. 2023 ప్రారంభంలో ఒక్కో ఇవిఎంకు అయ్యే అంచనా వ్యయం బియుకు రూ.7,900 చొప్పున, సియుకు రూ.9,800 చొప్పున, వివిప్యాట్‌కు రూ.16,000 చొప్పన ఉంది. జమిలి ఎన్నికలపై న్యాయ మంత్రిత్వశాఖ పంపిన ప్రశ్నావళికి సమాధానంగా ఇసి ఈ వివరాలు తెలియచేసింది. వీటితోపాటు అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఇవిఎంలు భద్రపరచడానికి పటిష్టమైన గిడ్డంగి సౌకర్యాలు, అదనంగా మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఇసి తెలిపింది. కొత్త ఇవిఎంల తయారీ, ఇవిఎంలను భద్రపరచడానికి మరింత ఎక్కువగా గిడ్డంగి సౌకర్యాలు, అందుబాటులో మరిన్ని వాహనాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మొదటి జమిలి ఎన్నికలను 2029లోనే నిర్వహించడం సాధ్యమవుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)