రూ. 1.10 కోట్ల విలువైన బూట్లతో ట్రక్కు డ్రైవర్‌ పరార్ !

Telugu Lo Computer
0


బెంగళూరులో డిసెంబరు 21న ప్రముఖ బూట్ల తయారీ సంస్థ 'నైకీ'కు ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ 'మింత్రా' నుంచి భారీ ఆర్డర్‌ వచ్చింది. వీటిని డెలివరీ చేసే వాహనానికి లస్కర్‌ అనే వ్యక్తిని డ్రైవర్‌గా నియమించారు. 1,558 జతల బూట్లను ఆ ట్రక్కులో ఎక్కించి మింత్రా గోదాముకు పంపించారు. వీటి విలువ రూ. 1.10 కోట్లు. ఈ బూట్లను కాజేసేందుకు ఆ డ్రైవర్‌ మరికొందరితో కలిసి ప్రణాళిక రచించాడు. సాయంత్రం ఆరు గంటలకే మింత్రా గోదాముకు చేరుకోవాల్సిన ట్రక్కు ఎంతకీ రాకపోవడంతో సూపర్‌ వైజర్‌ వెంటనే డ్రైవర్‌కు ఫోన్‌ చేశాడు. మరో 10 నిమిషాల్లో చేరుకుంటానని చెప్పిన డ్రైవర్‌, ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో అనుమానించిన సూపర్‌వైజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు జీపీఎస్‌ సాయంతో వాహనాన్ని గుర్తించారు. కానీ, అప్పటికే అందులో సరకు మాయమైంది. సమీపంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. అస్సాంకు చెందిన షుబాన్ పాషా, మన్సార్ అలీ, షాహిదుల్ రెహ్మాన్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ఖరీదైన బూట్లను సగం ధరకు విక్రయించి తక్కువ సమయంలో భారీగా సంపాదించేందుకే ఈ ప్లాన్‌ వేసినట్లు నిందితులు అంగీకరించారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)