ఇథనాల్​ తయారీకి చెరకు వాడొద్దు !

Telugu Lo Computer
0


దేశీయ వినియోగానికి సరిపడా చక్కెర లభ్యతను కొనసాగించేందుకు, ధరలను అదుపులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల ప్రారంభమైన 2023--24 సరఫరా సంవత్సరంలో ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రసం, చక్కెర సిరప్ వాడకాన్ని గురువారం నిషేధించింది. అయినప్పటికీ, 2023--24లో ఇథనాల్ ఉత్పత్తికి 'బి-మొలాసిస్'ని ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ చర్యను చక్కెర పరిశ్రమ సంస్థలు స్వాగతించాయి. 2023--24 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో (డిసెంబర్--నవంబర్) ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం, చక్కెర సిరప్‌ను ఉపయోగించవద్దని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అన్ని చక్కెర ఫ్యాక్టరీలను, డిస్టిల్లర్లను ఆదేశించింది. షుగర్ (నియంత్రణ) ఆర్డర్ 1966లోని క్లాజ్ 4, 5 ప్రకారం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. బి--హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్​ సరఫరా కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అందుకున్న ప్రస్తుత ఆఫర్లు కొనసాగుతాయని ఆహార మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. 2023--24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్--సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ స్వాగతించారు. బీ--మొలాసిస్‌తో తయారు చేసిన ఇథనాల్ స్టాక్​ భారీగానే ఉందని, కేంద్రం నిర్ణయం పరిశ్రమ ఆందోళనను పరిష్కరిస్తుందని చెప్పారు. అయితే, బీ--హెవీ మొలాసిస్‌ల నుంచి ఓఎంసీలు అందుకున్న "ఇప్పటికే ఉన్న ఆఫర్‌ల" నుంచి ఇథనాల్ సరఫరా కొనసాగుతుందని పేర్కొనడంలో కొంత అస్పష్టత ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న టెండర్ ముగిసిన తర్వాత ఉపసంహరించుకుంటారా ? లేదా ? అనే విషయమై స్పష్టత లేదని ఆయన తెలిపారు. చెరకు రసం, చక్కెర సిరప్ నుంచి ఇథనాల్ తయారీకి కొన్ని యూనిట్లు ఏర్పాటయ్యాయని, ఇవి పనిచేయకపోతే పాడవుతాయని ఆయన అన్నారు. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) 2023--24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్--సెప్టెంబర్) స్థూల చక్కెర ఉత్పత్తి తొమ్మిది శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పడిపోతుందని అంచనా వేసింది. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లింపును ఇది అంచనా వేయలేదు. 2022--23 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నులుగా ఉంది. ఈ మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి ఎగుమతులకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఆహార ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యం ఎగుమతులపైనా నిషేధం విధించింది. బాస్మతి బియ్యానికి కనీస ఎగుమతి ధరను నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)