పార్లమెంట్ పై దాడి చేస్తామంటూ ఖలిస్తాన్ తీవ్రవాదులు హెచ్చరిక !

Telugu Lo Computer
0


డిసెంబర్ 13న భారత పార్లమెంట్ పై పాకిస్తాన్ ముష్కరులు దాడికి ప్రయత్నించి 22 ఏళ్లు కావస్తోంది. సరిగ్గా 2001లో పార్లమెంట్ పై దాడికి ప్రయత్నించిన తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ ఘటన జరిగి 22 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మరోసారి పార్లమెంట్ పై దాడి చేస్తామంటూ ఈసారి ఖలిస్తాన్ తీవ్రవాదులు హెచ్చరికలు చేస్తున్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్ పై దాడి చేసి పునాదుల్ని పెకలిస్తామంటూ ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ చేసిన హెచ్చరిక కలకలం రేపుతోంది. అమెరికాలో ఉంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పేరుతో ఖలిస్తాన్ తీవ్రవాద సంస్ధ నడుపుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నున్.. భారత పార్లమెంట్ పునాదుల్ని తవ్వేస్తామంటూ చేసిన హెచ్చరికలపై విదేశాంగశాఖ స్పందించింది. ఇలాంటి హెచ్చరికలకు తాము అంత ప్రాధాన్యం ఇవ్వబోమని తెలిపింది. అయితే ఇప్పటికే అమెరికాలో గురుపత్వంత్ ను హత్య చేసేందుకు జరిగిన కుట్రను బైడెన్ సర్కార్ భగ్నం చేసింది. అయితే ఇందులో ఓ భారతీయుడి ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఇబ్బందిగా మారుతున్నాయి. అదే సమయంలో గురుపత్వంత్ భారత పార్లమెంట్ పై దాడి చేస్తామంటూ చేసిన హెచ్చరికపై కేంద్రం అంతర్గతంగా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ హెచ్చరికలపై దర్యాప్తు సంస్ధలు తమ పని తాము చేస్తాయంటూ విదేశాంగశాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చి తెలిపారు. భద్రతా సమస్యలపై వ్యాఖ్యానించడానికి తాను తగిన వ్యక్తి కాకపోయినా ఈ బెదిరింపుల్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని మాత్రం వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు దిగే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం, ఆయన మాటలకు విశ్వసనీయత ఇవ్వడానికి తాము వ్యతిరేకమని అరిందమ్ బాగ్చి తెలిపారు. అయితే ఈ వ్యవహారాన్ని అమెరికా, కెనడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)