చరిత్రను తిరగరాయడం అమిత్‌షాకు అలవాటుగా మారింది !

Telugu Lo Computer
0


పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్‌ విషయంలో ఘోర తప్పదాలకు పాల్పడ్డారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  చేసిన విమర్శలపై రాహుల్ గాంధీ  మండిపడ్డారు. అమిత్‌షాకు చరిత్ర తిరగరాసే అలవాటు ఉందని వ్యంగ్యోక్తులు విసిరారు. ''పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో ఉన్నారు. అమిత్‌షాకు చరిత్ర తెలియదు. తెలుసుకుంటారని కూడా నేను ఆశించడం లేదు. అయితే, చరిత్రను తిరగరాయడం ఆయనకు అలవాటుగా మారింది'' అని మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాహుల్ అన్నారు. ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ, నెహ్రూ రెండు తప్పిదాలు చేశారంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో కాల్పుల విమరణను ప్రకటించడం మొదటి తప్పిదమని, కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లడం రెండవదని అన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించకుండా ఉంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అనేది ఉండేదే కాదని, మన దేశం (భారత్) గెలిచేదని అన్నారు. రెండు రోజులు నెహ్రూ ఓపిక పట్టి ఉంటే కశ్మీర్ మొత్తం మనదే అయ్యేదని వ్యాఖ్యానించారు. నెహ్రూ లేకుండా కశ్మీర్ లేదని కొందరు చెబుతున్నారని, హైదరాబాద్ సమస్య ఎదుర్కొన్నప్పుడు నెహ్రూ అక్కడకు వెళ్లారా? లక్షద్వీప్, జునాగఢ్, జోథ్‌పూర్ వెళ్లారా? అని ప్రశ్నించారు. కశ్మీర్‌ మాత్రమే వెళ్లేవారని, అయితే ఆ విషయం కూడా అంసపూర్ణంగానే వదిలేశారని అన్నారు. కాగా, అమిత్‌షా వాదనను కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్‌షా పూర్తి అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఇండియన్ ఆర్మీ కమాండర్-ఇన్‌-చీఫ్ రాయ్ బుచెర్ అప్పటి ప్రభుత్వానికి ఇచ్చిన సలహా మేరకే కాల్పుల విరమణ చోటుచేసుకుందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)