మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం !

Telugu Lo Computer
0


'మన ఆర్థిక కష్టాలకు మనమే కారణం. భారత దేశమో, అమెరికానో కారణం కాదు. మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం' అని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించారు. తద్వారా పాక్‌లోని పాలనను శాసిస్తున్న సైనిక వ్యవస్థపై పరోక్ష విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) తరఫున టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి భారత్‌, అమెరికా కారణం కాదు. అఫ్గానిస్థాన్‌లో అనిశ్చితీ కాదు. వాస్తవానికి మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం. 2018 ఎన్నికల్లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారు. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ దిగజారింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడల్లా సైనిక నియంతలకు న్యాయమూర్తులు మద్దతుగా నిలిచారు. వారి పాలనకు చట్టబద్ధత కల్పించారు. ప్రధానులను తొలగించినప్పుడల్లా వారు ఆమోదించారు. ఇదంతా ఎందుకు జరిగిందో ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు. 2017లో తనను అధికారంలో నుంచి దించడానికి ఐఎస్‌ఐ మాజీ అధినేత జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ చేసిన ప్రయత్నాన్నీ గుర్తు చేశారు. ఇప్పటికే మూడు సార్లు పాక్‌ ప్రధానిగా పని చేసిన నవాజ్‌ షరీఫ్‌ నాలుగో సారి అధికారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. 1993, 1999, 2017లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)