హ్యాండ్ గ్లౌస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం !

Telugu Lo Computer
0


హారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా లో ఉన్న హ్యాండ్ గ్లౌస్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వలూజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సన్‌షైన్ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్‌లో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలో 13 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. వీరిలో ఆరుగురు చనిపోగా మిగతా ఏడుగురు ఫ్యాక్టరీ పైకప్పు పగులగొట్టి గాయాలతో బయటపడ్డారు. ఈ ఫ్యాక్టరీలో కాటన్, లెదర్ హ్యాండ్ గ్లౌస్ తయారు చేస్తుంటారని, రాత్రి 1.15 గంటల సమయంలో ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలిసిందని పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా వెల్లడించారు. అప్రమత్తం చేసిన తరువాత అగ్నిమాపక దళం వచ్చి తెల్లవారు జామున 3.30 గంటలకు మంటలు ఆర్ప గలిగారని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందన్నారు. గాయాలతో బయటపడ్డ కార్మికులకు వైద్య పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ జిల్లాకు చెందిన మంత్రి సందీపన్ భూమరే ఆదివారం ఉదయం ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ పైభాగంలో కార్మికులు నివసిస్తున్నారని, ఈ స్థలం పారిశ్రామిక ప్రయోజనం కోసమే తప్ప నివాసానికి కాదని కానీ దురదృష్ట వశాత్తు కార్మికులు ఇక్కడ నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణాలేమిటో దర్యాప్తు చేయాల్సిందిగా ఎలెక్ట్రీషియన్లను ఆదేశించడమైందన్నారు. ఆరుగురు మృతులను ఇంకా గుర్తించవలసి ఉందని ప్రభుత్వ మెడికల్ కాలేజీ , ఆస్పత్రి అధికారి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)