ఒమన్‌ సుల్తాన్‌తో ప్రధాని మోడీ భేటీ !

Telugu Lo Computer
0


మన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. దేశాధినేత హోదాలో హైతమ్‌ బిన్‌ తారిక్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. '' భారత్‌-ఒమన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరింది. ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌, ప్రధాని మోదీ మధ్య చర్చలకు దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా నిలిచింది'' అని భేటీ అనంతరం విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకోవడం, భవిష్యత్‌ ప్రయోజనాల దృష్ట్యా పరస్పర సహకార మార్గాలను అన్వేషించడం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు బాగ్చి తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు సుల్తాన్‌ హైతమ్‌కు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల నుంచి హైతమ్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఆయన భారత్‌ పర్యటన ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరువురు నేతల మధ్య చర్చలు ఉత్పాదకత దిశగా సాగినట్లు పేర్కొంది. భారత్‌, ఒమన్‌ చాలా కాలంగా వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)