తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ

Telugu Lo Computer
0


తెలంగాణలో 20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ఫలితాల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు 14మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ఫలితాల వరకు డీజీపీగా కొనసాగిన అంజనీకుమార్‌ను రోడ్డు భద్రత విభాగానికి చైర్మన్‌గా నియమించింది. అదనంగా ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా బదిలీ అయిన పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. తెలంగాణలో 2015 బ్యాచ్‌కు చెందిన 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న 14 మందికి జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ సేల్‌ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతి ఉత్తర్వులు 2024 జనవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రమోషన్‌ పొందిన వారిలో రమేలా సత్పతి, అనురాగ్‌ జయంతి, గౌతమ్‌ పోట్రు, రాహుల్‌ రాజ్‌, భావేశ్‌ మిశ్రా, సత్యశారదాదేవి, నారాయణరెడ్డి, ఎస్‌ హరీశ్‌, జీ రవి, కే నిఖిల, ఆయేషా మష్రత్‌ ఖానమ్‌, సంగీత సత్యనారాయణ, యాసిన్‌ బాషా, వెంకట్రావ్‌ ఉన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా శేషాద్రి, రిజ్వీలకు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐఏఎస్‌ అధికారి ఏ శ్రీదేవసేనకు సెక్రటరీగా సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14 పే మ్యాట్రిక్స్‌) పదోన్నతి కల్పించింది. అలాగే 2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌, కిల్లు శివకుమార్‌ నాయుడులకు సెలెక్షన్‌ గ్రేట్‌ (లెవల్‌ -13 పే మ్యాట్రిక్స్‌) పదోన్నతి కల్పించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)