కేంద్ర ప్రాయోజిత పథకాలకు మా పేరే ఉండాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 7 November 2023

కేంద్ర ప్రాయోజిత పథకాలకు మా పేరే ఉండాలి !


కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్‌ ముద్ర వేయడంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. వాటికి వైకాపా ప్రభుత్వం సొంత పేర్లు పెట్టుకుంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. కేంద్రం నిర్దేశించిన పేరు, లోగో, ఇతర వివరాల్లో మార్పులు చేయకూడదని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టుకునే పేర్లు (వైఎస్సార్‌, జగనన్న), ఇతర లోగోలు (నవరత్నాల లోగో) వంటివేవీ జత చేయకూడదని తెలిపింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి సుమారుగా రూ. 4,000 కోట్లు నిలిపేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్‌, జగన్‌ పేర్లు పెట్టడాన్ని రాష్ట్ర భాజపా నేతలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో దాదాపుగా 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. వీటికిచ్చే నిధుల్లో మెజారిటీ కేంద్రానివే. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు అందే రూ.1.80 లక్షల్లో కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో రూ.1.80 లక్షలు ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకంగా ప్రచారం చేసుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు వైఎస్సార్‌ పేరును జోడించి పీఎంఏవై- వైఎస్సార్‌ (అర్బన్‌)-బీఎల్‌సీ పథకంగా మార్చింది. అందులోనే కేంద్ర ప్రభుత్వ లోగోను ముద్రించడంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మతో కూడిన నవరత్న లోగో పెడుతోంది. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థలానికి, ఇతర మౌలిక వసతులకు మేం కూడా నిధులిస్తున్నాం కదా అని రాష్ట్ర ప్రభుత్వ వాదనను అంగీకరించనట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవేవీ ఉండకూడదని స్పష్టం చేసింది. చేసేదేమీ లేక వైఎస్సార్‌ పేరు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం విడుదల చేసింది. ఇప్పటికే పూర్తయిన 5 లక్షల గృహాల్లో ఏర్పాటు చేసిన బోర్డుల్ని మారుస్తామని కేంద్రానికి నివేదించింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) కింద రాష్ట్రంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల 10 జిల్లాల్లో కేంద్ర బృందం తనిఖీ చేసింది. అయితే ముందుగానే సమాచారం ఉండటంతో ఆయా గృహాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు హడావుడిగా బోర్డుల్ని మార్పించింది. వైఎస్సార్‌ పేరు, నవరత్న లోగో లేకుండా చూసింది. రెండురోజులపాటు పర్యటించిన కేంద్ర బృందం.. పరిశీలన వివరాలను కేంద్రానికి నివేదించింది. దీని ఆధారంగానే తదుపరి నిధులు విడుదల కానున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖలో ఐసీడీఎస్‌, పోషణ పథకాలు కేంద్ర ఆర్థిక సహకారంతో అమలవుతున్నాయి. మిషన్‌ వాత్సల్య, మిషన్‌శక్తి పథకాలూ కేంద్ర సహకారంతో నడిచేవే. అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు కేంద్రం రోజుకు ఒక్కొక్కరిపై రూ.4 ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పేర్లు పెట్టింది. దీనిపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసి, నిధులు ఆపేసినట్లు తెలిసింది.

No comments:

Post a Comment