34% మంది ఆదాయం నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 7 November 2023

34% మంది ఆదాయం నెలకు రూ. 6 వేల కంటే తక్కువ !


బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం పేదలు ఉన్నట్లు ఇటీవల చేపట్టిన కులగణన నివేదిక ద్వారా వెల్లడైంది. వీరి ఆదాయం నెలకు రూ.6 వేల కంటే దిగువన ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 29 శాతం మంది పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 28 శాతం మంది 10 వేల నుంచి 50 వేల మధ్య ఆదాయం పొందుతున్నారని, కేవలం 4 శాతం జనాభా మాత్రమే 50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్లు రిపోర్టులో తేలింది. కులగణన ఆధారిత సర్వే రెండో విడత డేటాను బిహార్‌ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం 215 షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలు, జనరల్‌ కేటగిరికి చెందిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. సర్వే అందించిన సమాచారం ప్రకారం.. ఎస్సీ ప్రజల్లో 42శాతం, ఎస్టీ జనాభాలో 42.70శాతం మంది పేదరికంలో నివసిస్తున్నట్లు వెల్లడైంది. వెనకబడిన (ఓబీసీ) వర్గాల్లో 33.16 శాతం, అత్యంత వెనకబడిన (ఈబీసీ) వర్గాల వారిలో 33.58 శాతం మంది సైతం పేదరికంలోనే మగ్గుతున్నట్లు పేర్కొంది. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఇవేగాక ఇతర కులాల్లోని పేదలు 23.72 శాతం ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ కులాల్లో కేవలం ఆరుశాతం కంటే తక్కువ మంది పాఠశాల విద్యను పూర్తిచేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారు 9 శాతం మంది ఉన్నారు. ఇక గత నెలలో విడుదల చేసిన కులగణన మొదటి విడత నివేదికలో బీహార్‌లో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. మొత్తం 13.1 కోట్ల రాష్ట్ర జనాభాలో 20 శాతం జనాభా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాదవ్, ముస్లిం వర్గాల జనాభాను పెంచాలని నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఓబీసీలకు, ఈబీసీలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై మండిపడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేంద్రమంత్రి ఆరోపణలను కొట్టిపారేశారు. యాదవులు వెనుకబడినవారు కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ప్రాతిపదికన ఒకరి జనాభా తగ్గిస్తున్నారు, ఒకరి జనాభా పెంచుతున్నారని ఆరోపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు మద్దతివ్వడానికి తమ వద్ద శాస్త్రీయ డేటా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే డేటా బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments:

Post a Comment