ఉల్లి ధరకు రెక్కలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 27 October 2023

ఉల్లి ధరకు రెక్కలు !


దేశంలో మరోసారి ఉల్లిఘాటైంది. సామాన్యుడి నిత్యావసర సరుకు అయిన ఉల్లిగడ్డ ధరలు రిటైల్‌గా దేశవ్యాప్తంగా సగటున చూస్తే 57 శాతం పెరిగాయి. దీనితో ఉల్లిగడ్డ చిల్లర ధరలు కిలోకు రూ.47 వరకూ పెరిగాయి. కొన్ని ప్రాంతాలలో సరఫరాలు సరిగ్గా లేకపోవడంతో ఇవి కిలోకు రూ 50 దాటాయి. హైదరాబాద్ బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డల ధరలు ఇప్పుడు కిలో రూ.70కు చేరడంతో, పలు బిర్యానీ సెంటర్లు ప్యాస్ వడ్డింపుపై పరిమితులు పాటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిగడ్డల ధరలు రూ 70 నుంచి రూ 80 వరకూ చేరుకున్నాయి. గడిచిన ఏడాది ఇదే నెలలో ఉల్లిగడ్డల ధరలు మార్కెట్‌లో కిలోకు రూ.30 అంతకు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారిందని వినియోగదారుల మంత్రిత్వశాఖ గణాంకాలతో స్పష్టం అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిగడ్డ ధర ఇప్పుడు కిలోకు రూ 40 అయింది. ఇంతకు ముందు ఇది రూ 30 వరకూ ఉండేది. ఈసారి దసరా పండుగ దశలో ఉల్లిగడలను అధిక ధరలకు కొనాల్సి వచ్చిందని, దీని భారం పడిందని వినియోగదారులు తెలిపారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్న ఉల్లిగడ్డ నాణ్యత కూడా లోపించి ఉంది. గడ్డల సైజుతో సంబంధం లేకుండా కిలో చొప్పున రేట్లు విపరీత స్థాయికి చేరాయి. కాగా మార్కెట్లకు బఫర్ నిల్వలను పంపించి కిలోకు రూ 25 చొప్పున సబ్సిడీ ధరలకు అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వినియోగదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా చూడటమే కీలకం అని, నిజానికి ఆగస్టు మధ్యనుంచే బఫర్ స్టాక్‌ను పంపిణీ చేస్తూ వచ్చినట్లు , ఇప్పటి పరిస్థితి నేపథ్యంలో మరింత అధికంగా కోటా తరలించనున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వార్తా సంస్థలకు తెలిపారు. రాష్ట్రాలలోని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లన్నింటికీ బఫర్ స్టాక్ తరలిస్తున్నట్లు వివరించారు. ఆగస్టు మధ్య నుంచి దేశంలోని 22 రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు ఇప్పటివరకూ దాదాపు 1.7 లక్ష టన్నుల ఉల్లిగడ్డ సరఫరా అయినట్లు తెలిపారు. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ కేంద్రాల ద్వారా ఈ పంపిణీ జరుగుతోంది. వీటి ద్వారా అందే సరుకును అన్ని చోట్లా కిలో పాతిక రూపాయలకు అమ్ముతున్నట్లు రోహిత్ కుమార్ ప్రకటించారు. ఇప్పుడు మార్కెట్‌లోకి అనుకున్న విధంగా ఉల్లిగడ్డ అందలేదని మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒక్కరు అంగీకరించారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌లో ఉల్లి సాగులో జాప్యం జరిగింది. ఈ పరిణామంతో తక్కువ స్థాయిలో ఆలస్యంగా సరుకు మార్కెట్లకు చేరిందని తెలిపారు. నిజానికి ఖరీఫ్ ఉల్లిపంట ఇప్పటికే మార్కెట్‌కు రావాల్సి ఉంది. అయితే ఇది చేరుకోలేదు. కాగా రబీ పంట నిల్వలు అయిపోతూ వచ్చాయి. దీనితోనే సరఫరాల పరిస్థితి గడ్డుగా మారిందని అధికారులు తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment