నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగా ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాయించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలిన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే అధిపతి. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో ఆస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. ఆస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు, ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు రణ్‌వీర్, తేజ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు.
రణ్‌వీర్ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా తేజ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్‌లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కుటుంబ సభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు.
No comments:
Post a Comment