విడాకుల కోసం ఆర్నెళ్లు ఆగక్కర్లేదు !

Telugu Lo Computer
0


కలిసి బతకలేని స్థితిలోజంట విడాకుల కోసం ఆర్నెళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని వివాహాల రద్దుపై సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తమకు విశిష్ట అధికారాలు ఉన్నాయని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గుర్తు చేసింది. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేధాలు, సమస్యలు పరిష్కారం కానీ స్థితి తలెత్తినప్పుడు కలిసి జీవించలేని స్థితి నెలకొంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 (విశిష్ట అధికారం) కింద తమకు ఉంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు విధించే ఆర్నెళ్ల గడువు ప్రస్తావనే ఉండబోదని స్పష్టం చేసింది. తద్వారా ఫాస్ట్‌ ట్రాక్‌ విడాకులకు సర్వోన్నత న్యాయస్థానం  తెర తీసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(B).. ప్రకారం పర‍స్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చు. కుటుంబ న్యాయస్థానాల్లో విడాకుల కోసం సుదీర్ఘంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. ఆర్టికల్‌ 142ను ఉపయోగించి.. తన తాజా ఆదేశాల్లో ఆ అంశాల్ని పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. ఫ్యామిలీ కోర్టులకు వెళ్లమని సూచించడానికి బదులుగా.. వెంటనే విడాకులను మంజూరు చేయొచ్చని అభిప్రాయపడింది. ''ఆర్థికల్‌ 142 అనేది ప్రాథమిక హక్కులకు వెలుగు రేఖ లాంటిదని సుప్రీం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. తద్వారా పూర్తిస్థాయి న్యాయం.. అదీ ఎలాంటి వాయిదాలు వేయకుండా ఈ కోర్టు అందిస్తుంద''ని తెలిపింది. ఏడేళ్ల కిందటినాటి ఈ కేసు.. సుప్రీం కోర్టులో అప్పటి డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులైన జస్టిస్‌ కీర్తి సింగ్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతి (ఇద్దరూ రిటైర్‌ అయ్యారు) రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం.. కిందటి ఏడాది సెప్టెంబర్‌ చివర్లోనే వాదనలు విని.. తీర్పును రిజర్వ్‌ చేసింది. చివరికి ఇవాళ (మే 1, 2023)న సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస​్‌ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస​్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస​్‌ ఏఎస్ ఓకా, జస్టిస​్‌ విక్రమ్ నాథ్, జస్టిస్‌ జేకే మహేశ్వరిలు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో.. భరణం చెల్లింపు, పిల్లల హక్కులకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా బెంచ్ వివరించింది.ఔ

Post a Comment

0Comments

Post a Comment (0)