రాష్ట్రపతి ఛాపర్‌ వద్ద సెల్ఫీలు దిగిన ఫార్మసిస్ట్ సస్పెండ్ !

Telugu Lo Computer
0


ఒడిశాలోని బరిపడాలో జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో విద్యుత్ వైఫల్యంపై వివాదం ముగియకముందే.. రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద సెల్ఫీలు దిగిన ఫార్మసిస్ట్‌ను మయూర్‌భంజ్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు వివరాలు సోమవారం ఓ అధికారి వెల్లడించారు. రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు ఫార్మసిస్ట్ జశోబంతా బెహెరాను సిడిఎంఓ డాక్టర్ రూపభాను మిశ్రా సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు. సస్పెండ్ చేయబడిన ఫార్మసిస్ట్ బెహెరా.. మే 5న సిమ్లిపాల్ నేషనల్ పార్క్‌ను సందర్శించినప్పుడు రాష్ట్రపతి వైద్య బృందంలో నియమించబడ్డారు. సస్పెన్షన్‌ అనంతరం జశోబంతా బెహెరా మాట్లాడుతూ.. ''ప్రెసిడెంట్‌ మేడమ్‌ గొప్ప వ్యక్తిత్వంతో జిల్లాకు వచ్చారు. నేను విధులు నిర్వహిస్తున్నాను. జ్ఞాపకార్థం కొన్ని చిత్రాలను తీసి ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాను. ఎటువంటి దురుద్దేశం లేదు. హెలికాప్టర్ భద్రతకై ఉన్న వైమానిక దళ సిబ్బంది నుండి నేను అనుమతి కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. మహారాజా శ్రీరామచంద్ర భంజా దేవ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి కార్యక్రమం సందర్భంగా విద్యుత్ వైఫల్యం అంశంపై కూడా రాజకీయ దుమారం చెలరేగింది. దేశ ప్రథమ పౌరురాలుని తొమ్మిది నిమిషాల పాటు చీకట్లో ఉంచినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై మయూర్‌భంజ్ జిల్లా కలెక్టర్‌తో పాటు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశేశ్వర్ తుడు డిమాండ్ చేశారు. మయూర్‌భంజ్ జిల్లాలోని స్థానిక సంస్థ భంజ సేన, రాష్ట్రపతి కార్యక్రమంలో విద్యుత్‌కు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకోకపోతే బంద్ నిర్వహించేందుకు వెనుకాడబోమని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)