రికార్డు సృష్టించాలన్న కల చెదిరింది !

Telugu Lo Computer
0


భారత్ కు చెందిన సుజానే లియోపోల్డినా జీసస్‌ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోన్న ఆమెకు వైద్యులు పేస్‌మేకర్ అమర్చారు. అయితే, ఎవరెస్ట్‌ అధిరోహించాలని, పేస్‌మేకర్‌ ధరించి ఆ శిఖరాన్ని చేరుకున్న తొలి ఆసియా మహిళగా రికార్డు సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ప్రాణాలు లెక్కచేయకుండా సిద్ధమయ్యారు. అయితే బేస్‌క్యాంపు వద్ద సాధారణ అభ్యాసాల్లో ఆమె కనీస వేగాన్ని అందుకోలేక ఇబ్బంది పడటం, అలాగే అధిరోహణకు కష్టపడటం చూసిన సిబ్బంది, ఇక ముందుకెళ్లొద్దని వారించారు. కానీ, వారి మాటలు లెక్క చేయకుండా తాను అన్నింటికి అనుమతులు తెచ్చుకున్నానని, వెనక్కి వెళ్లనని చెప్పారు. నిర్వాహకుల్లో ఒకరైన దెండి షేర్పా మాట్లాడుతూ 'ఐదురోజుల క్రితమే ఆగిపోవాలని ఆమెను హెచ్చరించాం. కానీ, సుజానే మాత్రం ముందుకువెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ముందుకు వెళ్లడానికి అవసరమైన కనీస ప్రమాణాలను అందుకోలేకపోయారు. 250 మీటర్ల దూరం చేరుకోవడానికి ఆమెకు ఐదు గంటలు పట్టింది. మామూలుగా అయితే క్లైంబర్లు ఆ దూరాన్ని 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకుంటారు. మూడు ప్రయత్నాల్లోనూ ఆమె వెనకబడిపోయారు. బేస్‌క్యాంప్‌ నుంచి 5,800 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఆమె ఆరోగ్యం సహకరిచడం లేదని గుర్తించి, బలవంతంగా ఆసుపత్రికి తరలించాం. నేపాల్‌లోని లుక్లా ప్రాంతంలోని ఆసుపత్రిలో చేర్పించాం'అని చెప్పారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు నేపాల్‌  పర్యాటక విభాగం డైరెక్టర్ యువరాజ్‌ ఖటివాడా తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)