ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి మోడీ జీ ?

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా  ఇచ్చిన హామీ మాత్రం అమలు కాలేదు. ఈ నేపథ్యంలో మోడీ 'రోజ్‌గార్‌ మేళా' కింద 71 వేల మంది యువతకు అపాయింట్‌మెంట్‌ లెటర్లను మంగళవారం అందజేసినట్లు చెప్పడాన్ని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రధాని మోడీ చేసిన వాగ్ధానాలపై ఖర్గే మండిపడ్డారు. 'రోజ్‌గార్‌ మేళా' కింద యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఖర్గే ట్వీట్‌ చేశారు. '2014 ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీజీ.. ఈ తొమ్మిది సంవత్సరాల్లో 18 కోట్ల మంది యువతరం కలలను చిన్నాభిన్నం చేశారు. ప్రభుత్వ శాఖలలో 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈరోజు కార్యక్రమంలో మీరు 71 వేల రిక్రూట్‌మెంట్‌ లెటర్‌లను మాత్రమే పంపిణీ చేశారు. యువతకు మీరు ద్రోహం చేశారు. యువతకు మీరు చేసిన ద్రోహానికి కాంగ్రెస్‌ పార్టీ తగిన సమాధానం చెబుతుంది' అని ఖర్గే ట్వీట్‌ చేశారు. కాగా, 71 వేల రిక్రూట్‌మెంట్‌ లెటర్లపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రధానిపై విరుచుకుపడ్డారు. 'మునుపెన్నడూ లేని విధంగా పరిపాలనను ప్రధాని మోడీ నాశనం చేశారు. ఈ 'రోజ్‌గార్‌ మేళా' ద్వారా మోడీ పాలన నాశనానికి మరోస్థాయికి తీసుకెళ్లాడు. అతనే ఉద్యోగాలను సృష్టించినట్లుగా, ఈ ఉద్యోగాలు పొందుతున్న వారికి అతనే వ్యక్తిగతంగా జీతం చెల్లిస్తున్నట్లుగా, ఈ ఉద్యోగాలు పొందేవారు అతనికి మాత్రమే గౌరవంగా భావించాలి అన్నట్లుగా వుందని' జైరాం రమేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా నోట్లరద్దు, జిఎస్‌టి, ఎంఎస్‌ఎంఇలను నిర్విర్యీం చేయడం, పిఎస్‌యులను హోల్‌సేల్‌గా ప్రైవేటీకణ చేయడం, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు నాశనం చేయడం వంటివన్నీ ప్రధాని మోడీ హయాంలోనే జరిగాయన్న నగసత్యం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న యువతకు బాగా తెలుసని జైరామ్‌ రమేశ్‌ తీవ్రంగా విమర్శించారు. అలాగే 'తనను తాను స్వయం నిర్మిత వ్యక్తి అని ప్రధాని మోడీ చెప్పుకుంటున్నాడు. కానీ, తనను తయారుచేసిన వ్యక్తితో అతను నిమగమై ఉన్నాడు' అని రమేష్‌ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)