మన్ కీ బాత్ వినలేదని నర్సింగ్ విద్యార్థులను గదిలో బంధించారు !

Telugu Lo Computer
0


చండీగఢ్ లోని ఓ నర్సింగ్ కాలేజీలో మన్ కీ బాత్ వినలేదని నర్సింగ్ స్టూడెంట్లను వారం పాటు హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కు చెందిన 36 మంది నర్సింగ్ విద్యార్థులు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను వారం పాటు హాస్టల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఏప్రిల్ 30న ప్రసారమైన 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ను మొదటి, మూడో సంవత్సరం విద్యార్థులు ఇనిస్టిట్యూట్ లోని లెక్చర్ థియేటర్-1లో తప్పనిసరిగా వినాలని హాస్టల్ -9 వార్డెన్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరుకాకపోతే బయటకు వెళ్లనివ్వబోమని విద్యార్థులను హెచ్చరించారు. '' వార్డెన్, హాస్టల్ కోఆర్డినేటర్ పదేపదే మన్ కీ బాత్ వినాలని గుర్తు చేసినా హాస్టల్ -9 కు చెందిన మొత్తం 36 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఇందులో ఫస్ట్ ఇయర్ కు చెందిన 8 మంది, థర్డ్ ఇయర్ కు చెందిన 28 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, సమాచారం కోసం తెలియజేస్తున్నాం'' అని పీజీఐ డైరెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 28 మంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని మే 3న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమను బయటకు రానివ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. కాగా.. నర్సింగ్ విద్యార్థులపై తీసుకున్న చర్యలపై సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ''మన్ కీ బాత్ నేను కూడా వినలేదు. ఒక్కసారి మాత్రమే కాదు. ఎప్పుడూ నేను వినలేదు. మరి నాకు కూడా శిక్ష పడుతుందా? వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా నిషేధం విధిస్తారా? నాకిప్పుడు చాలా టెన్షన్ గా ఉంది'' అంటూ ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)