పనిచేస్తా, పోటీ చేయను !

Telugu Lo Computer
0


నేషనల్ కాంగ్రెస్ పార్టీ  చీఫ్ పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న శరద్ పవార్ శనివారం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ పరిణామాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. కొత్త జనరేషన్‌కు బాధ్యత అప్పగించడానికి ఇదే సమయమని భావించడంతో నెల రోజుల నుంచి ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలనే ఆలోచన చేస్తూ వచ్చినట్టు చెప్పారు. ''రాజీనామా విషయాన్ని నా సన్నిహితులతో చర్చిద్దామని అనుకున్నాను. అయితే వాళ్లు ఒప్పుకోరేమోనని భయపడ్డాను. అందువల్లే నా నిర్ణయాన్ని వాళ్లకు చెప్పలేదు. నా నిర్ణయాన్ని పార్టీ వాళ్లు ఒప్పుకుని ఉండాల్సింది. కానీ అలా జరగలేదు, నా అంచనా తప్పింది'' అని పవార్ అన్నారు. సోనియాగాంధీ సైతం తనను ఫోను చేసి తన నిర్ణయాన్ని పునరాలోచించమని కోరారని, అసోం నుంచి కేరళ వరకూ అగ్రనాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించిందని చెప్పారు. రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విషయలో తన మేనల్లుడు, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ కీలక భూమిక పోషించారని శరద్ పవార్ ప్రశంసించారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పని చేస్తానని , అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని శరద్ పవార్ స్పష్టం చేశారు. తమ మిత్రులు ఎవరైనా పోటీ చేస్తే వారి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. తదుపరి జనరేషన్‌కు బాధ్యతలు అప్పగించే విషయంపై శరద్ పవార్ మాట్లాడుతూ, వారసుడు ఎవరనే దానికి కొంత సమయం పడుతుందన్నారు. తదుపరి తరానికి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే సుప్రియ సులే, ప్రఫుల్ పటేల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని అన్నారు. వారసుడి ఎంపికకు ఇంకా మూడేళ్ల సమయం తమ చేతిలో ఉందన్నారు. పార్టీలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారని, జిల్లాల్లో పనిచేసే వారిని రాష్ట్ర రాజకీయాల్లోకి తెస్తామని, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వారిని దేశ రాజకీయాల్లో పాల్గొనేందుకు సంసిద్ధం చేస్తామని పవార్ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)