రూ.132 కోట్ల ఆస్తి ఆవిరి !

Telugu Lo Computer
0


సీనియర్ నటి కవిత పదకొండేళ్లకే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరపై రంగప్రవేశం చేసింది. సిరిసిరి మువ్వతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ సత్తా చాటింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో దాదాపు  350కి పైగా చిత్రాలు చేసింది. 1983లో దశరాథరాజ్‌ను పెళ్లాడగా కరోనా వల్ల ఆయన 2021లో కన్నుమూశారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే కొడుకు కూడా మరణించి ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చారు. తాజాగా సీనియర్‌ నటి కవిత సినీ విశేషాలతో పాటు తన జీవితంలోని విషాదాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 'నా భర్త బిజినెస్‌ చేసేవారు. ఆరేళ్ల క్రితం ఆయనకు బిజినెస్‌లో భారీ నష్టం వచ్చింది. కేవలం 9 నెలల గ్యాప్‌లోనే రూ.132 కోట్లు పోయాయి. ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టాడు. తనే లోలోప మధనపడ్డాడు. ఒకరోజు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడని చెప్పారు. 11 రోజులు కోమాలో ఉన్నాడు. 12వ రోజు కళ్లు తెరిచాడు. కానీ మరో 35 రోజులు ఐసీయూలో ఉంచారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చాం. అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలని ఓ మూడు నెలల తర్వాత ఆయన్ను కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాను. అప్పుడు ఆయన రూ.132 ​కోట్లు నష్టపోయిన విషయాన్ని బయటపెట్టాడు. కొన్ని ప్రాపర్టీలు అమ్మాల్సి వచ్చిందన్నాడు. మేము ఏమైపోతామోనని భయపడ్డాడు. దీనికోసం ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? అని మందలించాను. ఆ భయాన్నంతా పక్కన పడేయమని నేను ధైర్యాన్నిచ్చాకే ఆయన కోలుకున్నాడు' అని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌తో జరిగిన గొడవ గురించి స్పందిస్తూ  'జయచిత్ర నన్ను చాలా ఏడిపించేవారు. ఒకరోజు షూటింగ్‌కు ఇద్దరం ఒకే కలర్‌ సారీ కట్టుకుని వచ్చాం. డైరెక్టర్‌ తనను చీర మార్చుకోమన్నాడు. ఆమె నన్ను చిటికేసి పిలిచి ఏయ్‌, పోయి చీర మార్చుకోపో అని చెప్పింది. అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన నేను, మీ పని మీరు చూసుకోండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ముందు వాళ్లు ఏం చెప్తున్నారో అది వినండి. మీకూ నాకూ గొడవెందుకు? అన్నాను. అంతే, ఈ గొడవ పెద్దదై ఏడాది దాకా ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత ఎవరూ నాతో మాట్లాడలేదు. మరోసారి ఏమైందంటే కాస్ట్యూమ్‌ చేంజ్‌ చేసుకోవడానికి ఒకరి క్యారవాన్‌లోకి వెళ్తే గెట్‌ అవుట్‌ అన్నారు. వెంటనే కోపంతో చెంప పగిలిపోద్ది అని తిట్టాను' ఆనాటి గొడవను గుర్తు చేసుకుంది. కరోనా తన జీవితంలో మిగిల్చిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది నటి. 'కరోనా వల్ల నా భర్త నాకు దూరమైపోయాడు. జయప్రద ఫోన్‌ చేసి నీకు దొరికిన భర్త ప్రపంచంలో ఎవరికీ దొరకడు అని చెప్పగానే గుక్కపెట్టి ఏడ్చేశాను. నన్ను ప్రాణంగా ప్రేమించేవాడు. ఆయన చనిపోయిన పది రోజులకే నా కొడుకు సాయి చనిపోయాడు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోయాను. మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. తర్వాత నా పిల్లల కోసం బతకాలనుకున్నాను. షూటింగ్‌తో బిజీ అయిపోతే ఈ బాధను మర్చిపోవచ్చకున్నాను. అప్పుడు తమిళ సీరియల్‌కు ఓకే చెప్పాను' అంటూ కవిత కన్నీళ్లు పెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)