ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ హతం

Telugu Lo Computer
0


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ ని టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు మట్టుబెట్టాయి. సిరియాలో ఈ ఆపరేషన్ కొనసాగింది. దీన్ని విజయవంతంగా ముగించినట్లు టర్కీ ప్రకటించింది. 60 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ పూర్తయినట్లు పేర్కొంది. మృతదేహాన్ని పరీక్షించిన తరువాత అది ఐసిస్ చీఫ్‌దేనని నిర్ధారించినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ సహా పలు దేశాల్లో ఐసిస్ ప్రాణాంతక దాడులకు పాల్పడుతూ వస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంది. భారత్‌లోనూ ఇస్లామిక్ స్టేట్ జాడలు ఉన్నాయి. కేరళ, తమిళనాడుకు చెందిన చాలామంది ఐసిస్‌లో చేరినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఐసిస్ సానుభూతిపరులుగా ముద్రపడిన కొందరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఉగ్రవాద సంస్థకు అబు బాకర్ అల్ బాగ్దాది సారథ్యాన్ని వహించాడు. నవంబర్‌లో ఆత్మాహూతి దాడిలో అతను చనిపోయాడు. బాగ్దాది స్థానంలో అబు హుస్సేన్ అల్ ఖురేషీ నియమితుడయ్యాడు. అతణ్ని అంతమొందించడానికి టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు రంగంలోకి దిగి, సిరియా ఉత్తరప్రాంతంలో జిన్దారిస్‌లో ఖురేషీ తలదాచుకుంటున్నట్లు పసిగట్టాయి. టర్కీ సరిహద్దుకు ఆనుకునే ఉంటుంది ఈ జిన్దారిస్ టౌన్. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియాల్లో సుమారు 50 వేల మందిని బలి తీసుకున్న పెను భూకంపాల్లో తీవ్రం నష్టపోయిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. అబు హుస్సేన్ అల్ ఖురేషీ ఇక్కడే మకాం వేసినట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో టర్కీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఆ పట్టణాన్ని చుట్టుముట్టి బాంబుల వర్షాన్ని కురిపించాయి. టర్కీకే చెందిన తిరుగుబాటు బలగాలు సహకారంతో ఐసిస్ ఉగ్రవాదులు ప్రతిఘటించినప్పటికీ- అది ఎక్కువ సేపు కొనసాగలేకపోయింది. సుమారు గంట పాటు సాగిన భీకర పోరులో టర్కీ ఇంటెలిజెన్స్ బలగాలు.. ఖురేషిని హతమార్చాయి. అతను మరణించినట్లు ధృవీకరించుకున్న తరువాత ఈ విషయాన్ని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డగాన్ అధికారికంగా ప్రకటించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)