మూడో ఎలక్ట్రికల్ లైన్ రెడీ !

Telugu Lo Computer
0


ఎర్రుపాలెం – చెరువుమాధవరం రైల్వే స్టేషన్ల మధ్య 16.6 కిలోమీటర్ల పొడవునా విద్యుద్దీకరణతో పాటు మూడవ లైన్‌ను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ విభాగం గ్రాండ్ ట్రంక్ రూట్‌లోని ముఖ్యమైన మూడవ లైన్ ప్రాజెక్ట్.. విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా పనులు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే విజయవాడ – కాజీపేట మధ్య విభాగం దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర భాగాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గం వెంట ఉన్న అత్యంత కీలకమైన రైలు మార్గంగా చెప్పొచ్చు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ – కాజీపేట విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదీ ఒకటి. అలాగే దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల వైపు నిరంతరం ప్రయాణీకులతో పాటు, సరకు రవాణాకు ఈ మార్గం కీలకమని చెప్పాలి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని విజయవాడ – కాజీపేట ట్రిప్లింగ్‌తో పాటు విద్యుదీకరణ ప్రాజెక్ట్ 219 కి.మీ (ఆంధ్రప్రదేశ్ – 35 కి.మీ. & తెలంగాణ – 184 కి.మీ) చేపట్టారు. ఇందు కోసం రూ. 1952 కోట్లను మంజూరు చేశారు. విజయవాడ న్యూ వెస్ట్ క్యాబిన్ – చెరువుమాధవరం క్యాబిన్ మధ్య 16.7 కిలోమీటర్ల దూరం విద్యుదీకరణతో పాటు సెక్షన్ సెప్టెంబర్, 2022లో పూర్తి చేసి ప్రారంభించారు. తాజాగా ఎర్రుపాలెం-చెరువుమాధవరం మధ్య 16.6 కిలోమీటర్ల మేర మూడో లైను విద్యుదీకరణ ప్రారంభమైంది. మొత్తం 16.6 కి.మీల విస్తీర్ణానికి గాను 5.5 కి.మీలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి, మిగిలినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉంది. వీటి మధ్య విస్తరించి ఉన్న మార్గంలో మూడో లైన్‌ను ప్రారంభించడం వల్ల సరుకు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లకు రద్దీ తగ్గుతుంది. ఈ విషయమైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ  చెరువుమాధవరం – ఎర్రుపాలెం మధ్య ట్రిపుల్ లైన్ పనులను విద్యుద్దీకరణ పనులను విజయవంతంగా ప్రారంభించినందుకు సిబ్బందిని అభినందించారు. కాజీపేట – విజయవాడ ట్రిప్లింగ్ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం వల్ల రద్దీని తగ్గించడంతో పాటు, అధిక సంఖ్యలో రైళ్లను సమర్థవంతంగా నిర్వహించడం సులభతరమవుతుందని అరుణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల పనుల పురోగతి సంతృప్తికర స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)