రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదు !

Telugu Lo Computer
0


తెలంగాణలో పసుపు బోర్డును గానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గానీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఏవీ తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్ లో లిఖితపూరక సమాధానం ఇచ్చింది. ఈ రెండింటినీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తెలంగాణలో ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకొస్తానంటూ భారతీయ జనతా పార్టీకే చెందిన లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఈ హామీతోనే ఆయన 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితను ఓడించారు. 70 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచీ పసుపు బోర్డు డిమాండ్ వినిపిస్తూనే వస్తోంది. బీఆర్ఎస్ తరచూ దీనిపై ధర్మపురి అరవింద్ ను నిలదీస్తూనే వస్తోంది. ఆ డిమాండ్లు, ప్రయత్నాలేవీ ఫలించలేదనేది మరోసారి స్పష్టమైంది. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, పీ దయాకర్, జీ రంజిత్ రెడ్డి, మాలోతు కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం-1986 ప్రకారం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు, పసుపు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించినట్లు అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలో- దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా నిర్ధిష్ట బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు. అదే విధంగా ఖాజీపేట్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌ సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రోలింగ్ స్టాక్‌ల అవసరాన్ని బట్టి రైల్వేలో రైల్ కోచ్ ఫ్యాక్టరీలు మంజూరవుతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇప్పటికే మంజూరైన కోచ్ ఫ్యాక్టరీలు సమీప భవిష్యత్తులో రైల్వే అవసరాలను తీర్చడానికి సరిపడేలా రోలింగ్ స్టాక్స్ ను అందిస్తోన్నాయని చెప్పారు. దీనికి అదనంగా మరో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తమ వద్ద లేవని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)