హిండెన్‌బర్గ్ హిట్ లిస్టులో మరో దిగ్గజ సంస్థ !

Telugu Lo Computer
0


గౌతమ్ అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక బాంబు పేల్చిన విషయం తెలిసిందే. దీంతో అదాని గ్రూప్ 120 బిలియన్ల డాలర్ల గరిష్ట నష్టాన్ని చవిచూసి ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో దారుణమైన స్థానానికి పడిపోయారు. సెప్టెంబర్ 2022 లో 150 బిలయన్ల డాలర్లు ఉన్న అదానీ సంపద 53 బిలియన్ల డాలర్లకు చేరటంతో ఆయన సంపదను ఒక్క రిపోర్ట్ ఎంతగా ఆవిరి చేసిందో అర్ధం చేసుకోవచ్చు. జనవరి 24వ తేదీన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అధ్యయనం స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు అదాని గ్రూప్ సంస్థలపై విడుదల చేసిన నివేదిక మొత్తంగా మార్కెట్ ని కుదిపేసింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీని, అతని వ్యాపార సమ్మేళనాన్ని లక్ష్యంగా చేసుకున్న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికతో అతని సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక తాజాగా మరో బాంబు పేల్చటానికి, మరో సంస్థను టార్గెట్ చేస్తూ త్వరలో మరో పెద్ద సంస్థకు చెందిన మరో కొత్త నివేదిక విడుదల చేయబోతున్నట్టు హిండెన్‌బర్గ్ ట్వీట్ చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకతను రేకర్తిస్తుంది. అయితే ఇది యూఎస్ లోని బ్యాంకుకు సంబంధించిందా లేక మరో ఇండియన్ కంపెనీనా అన్నది ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది. కొందరు హిండెన్‌బర్గ్ పోస్ట్ కి స్పందిస్తూ ఇది మరో భారతీయ కంపెనీకి సంబంధించింది కాదు కదా అంటూ ప్రశ్నించారు . మరొక నెటిజన్ ఈసారి చైనా కంపెనీపై నివేదిక రూపొందించాలని కోరారు. ఇక త్వరలో మరొక కంపెనీకి సంబంధించిన నివేదిక వెల్లడిస్తామని హిండెన్‌బర్గ్ హింట్ ఇవ్వడంతో అనేక భారతీయ దిగ్గజ కంపెనీలు సైతం ఆందోళనలో ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక ఏ సంస్థకు సంబంధించిన అయ్యుంటుంది అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భారతదేశంలో గౌతమ్ అదానీ సంస్థలపై విరుచుకుపడిన హిండెన్‌బర్గ్ నివేదిక మార్కెట్లో సంచలనం సృష్టించడమే కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార బిజెపిని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసేలా చేసింది. ఏకంగా పార్లమెంట్లో హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదాని సంస్థలపై విచారణ జరిపించాలని ప్రధాన నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేటికీ దేశంలో హిండెన్‌బర్గ్ నివేదిక రేపిన రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇక ఇదే సమయంలో మళ్లీ మరో పెద్ద సంస్థ పై నివేదిక త్వరలోనే ఇస్తామని చెప్పడం వ్యాపార వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)