ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్రలో తనకు అత్యాచారినికి గురైన ఇద్దరు మహిళలు కలిశారంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోలీసులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీకి ఇంటికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలు తనను భారత్ జోడో యాత్రలో కలిశారని ఆయన చెప్పిన నేపథ్యంలో, ఆ మహిళలకు న్యాయం చేస్తామని, వారి వివరాలు తమకు ఇవ్వాలని రాహుల్ గాంధీకి పంపిన నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు కోరారు. రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, మన దేశంలో ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దీని గురించి మీడియా మాట్లాడటం లేదని అన్న ఆయన.. తన పాదయాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని చెప్పారు. తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, అయితే ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని రాహుల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యామని చెప్పారు. సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా చాలా మంది తనతో మాట్లాడారని ఆయన చెప్పారని అన్నారు. బాధిత మహిళల సమాచారాన్ని అందజేయడానికి తనకు కాస్త సమయం కావాలని కోరారని చెప్పారు. త్వరలోనే సమాచారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ అంశంపై తాము తాజాగా ఇచ్చిన నోటీసును ఆయన కార్యాలయం స్వీకరించిందని చెప్పారు. ప్రశ్నించవలసి వస్తే ప్రశ్నిస్తామని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)