వడ్డీ రేటు పెంచిన ఈపీఎఫ్ఓ

Telugu Lo Computer
0


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.10 వడ్డీ ఇచ్చిన ఈపీఎఫ్ఓ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులకు  ఇచ్చే వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్స్ పెంచింది. ఈ నిర్ణయం 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేయనుంది. గత రెండు రోజులుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఈపీఎఫ్ వడ్డీరేటుపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఈపీఎఫ్ ఖాతాదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరానికి అతి తక్కువగా 8.1 శాతం వడ్డీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇది గత నాలుగు దశాబ్దాల్లో ఇదే కనిష్ట వడ్డీ రేటు. అంతకన్నా ముందు సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. కానీ గతేడాది ఒకేసారి ఏకంగా 40 బేసిస్ పాయింట్స్ వడ్డీని తగ్గించడం ఈపీఎఫ్ ఖాతాదారుల్ని నిరాశపర్చింది. ఈపీఎఫ్ఓ వడ్డీ తగ్గిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది నాలుగు దశాబ్దాల్లోనే తక్కువ వడ్డీని ప్రకటించడం ఉద్యోగులను నిరాశపర్చింది. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అవుతుంది. అయితే గతేడాదికి సంబంధించిన వడ్డీ పలు కారణాల వల్ల ఆలస్యంగా జమ అయింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)