జ్వరం, బీపీ, షుగర్ మందుల ధరలు పెంపు !

Telugu Lo Computer
0


27 రకాల చికిత్సలకు సంబంధించిన 384 నిత్యావసర ఔషధాల ధరలను 12.12 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది 10.7 శాతం ధరలు పెంచగా.. ఈ సారి మరింతగా పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ స్థూల ధరల సూచీ పెరుగుదల ఆధారంగా అవసరమైన ఔషధాల ధరలను పెంచడానికి తయారీదారులను అనుమతించింది. దాంతో అత్యవసర జాబితాల్లో ఉన్న 800 రకాల ఔషధాల ధరలను పెంచారు. జ్వరానికి వాడే పారాసిటమాల్‌, యాంటి బయాటిక్స్‌, అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్‌, చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, రక్తహీనత, క్షయ, వివిధ రకాల క్యాన్సర్లు వంటి వాటి మందులతోపాటు మినరల్‌, విటమిన్‌ మాత్రలు, పెయిన్‌ కిల్లర్లు ధరలు పెరగనున్నాయి. అవసరమైన మందుల జాబితాలో లేని మందులపై వార్షిక ధరలను 10 శాతం పెంచడాని కమిటీ ఆమోదించింది.నిత్యావసర మందులకు 12 శాతం పెంపును అనుమతించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నాన్‌-షెడ్యూల్డ్‌ డ్రగ్స్‌కు అనుమతించిన దానికంటే ఎక్కువ పెంచడం ఇది వరుసగా రెండో సంవత్సరం. 2013లో ఔషధ ధరల నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, ప్రతి సంవత్సరం మందుల ధరలను సవరిస్తూ వచ్చిన తరువాత ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతకు ముందు ప్రతి మూడేళ్లకు ఒకసారి ధరల పెంపు ఉండేది. కాగా.. ఔషధాల ధరలు గతేడాది కంటే ఇప్పటికే 20 శాతం పెరిగాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)