విశాఖ నుంచే పోటీ చేస్తా !

Telugu Lo Computer
0


మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. తనకు బీఆర్ఎస్, వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయన్నారు. ఇప్పటికీ తమ పార్టీల్లో చేరాలని కోరుతున్నారని వివరించారు. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిన లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. తాను ఆ ఎన్నికల్లో గెలిచినట్లుగానే భావిస్తున్నట్లు చెప్పారు. తనకు 2,88,754 ఓట్లు రావటం ద్వారా అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది గుర్తించాలన్నారు. ఇప్పటికీ తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేస్తున్నానని వివరించారు. రాత్రికి రాత్రి ఒక అధికారితో రాజీనామా చేయించి ఎన్నికల కమిషనర్ ను చేయటం సరి కాదని అభిప్రాయపడ్డారు. తనకు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్, తాను ఒకే కేడర్ అని గుర్తు చేసారు. ఇద్దరు కలిసి మహారాష్ట్రలో పని చేశామన్నారు. తాము ఇద్దరం కూడా జనసేనలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఆయనకు ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించటంతో తనను కూడా రావాలని అడిగారాని, తాను ఆలోచన చేస్తున్నానని వెల్లడించారు. తనను వైసీపీ నేతలు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. పార్టీలోకి రండి అంటు అడుగుతూ ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలోనూ తనను వైసీపీలోకి రమ్మన్నారని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై చర్చకు హామీ ఇస్తే  తాను పార్టీల్లో చేరటానికి సిద్దమని స్పష్టం చేసారు. విశాఖ నుంచి తిరిగి తాను పోటీ చేయటం ఖాయమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తాను కోరుకొనే అంశాల పైన పార్టీలు చర్చకు సిద్దమైతే వారితో కలుస్తానని, లేకుంటే తాను స్వతంత్రంగానే బరిలోకి దిగేందుకు సిద్దమని తేల్చి చెప్పారు. తాను వీఆర్ఎస్ తీసుకోవటానికి ముందు హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌డీ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. అది వచ్చి ఉంటే రాజకీయాలవైపు వచ్చి ఉండేవాడిని కాదని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిపోలేదన్నారు. కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక పెట్టాల్సి వస్తే, అక్కడ అప్పటికే సెకండ్‌ వచ్చిన వారిని మిగిలిన కాలానికి ఎమ్మెల్యేను చేయాలని..ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని లక్ష్మీనారాయణ అభిప్రాయ పడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)