ఢిల్లీ ప్రజల కోసం మమ్మల్ని పని చేయనివ్వండి !

Telugu Lo Computer
0


ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం పూర్తి రాష్ట్రం కానందున, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా చాలా పరిపాలనా వ్యవహారాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. కేంద్రం తన అధిక ప్రకటన వ్యయంపై స్పష్టత కోరడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ మేము మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 20,000 కోట్లు, ప్రకటనల కోసం రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. ఢిల్లీ బడ్జెట్‌ను ఒక్కరోజు పాటు ఆపడం వల్ల ఎవరికీ ఉపయోగపడలేదన్నారు. ప్రధాన మంత్రి మీరు మీ పని చేయండని, ఢిల్లీ ప్రజల కోసం మమ్మల్ని పని చేయనివ్వండని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని సహకరించాలని, దయచేసి పోరాడకండని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ బడ్జెట్‌పై ‘అన్‌పధో కి జమాత్’ (చదువుకోని వ్యక్తుల సమూహం) అనవసరంగా దుమ్మెత్తిపోస్తోందని పేర్కొన్న ఢిల్లీ సీఎం.. ఢిల్లీ బడ్జెట్‌ను చదివి అర్థం చేసుకోగల విద్యావంతులను బీజేపీ నియమించుకోవాలని అన్నారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీని ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం అడ్డుకోవడం వల్లే ఢిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయామని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోగలదని భావించి ఉండరన్నారు. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను ఆమోదం కోసం కేంద్రానికి పంపడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌పై కేంద్రం అభ్యంతరం చెప్పడం సంప్రదాయానికి విరుద్ధమని ముఖ్యమంత్రి అన్నారు. “ఇది మొదటిసారి జరిగిందని, ఇది రాజ్యాంగంపై దాడి అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను సమర్పణను నిలిపివేసే పరిస్థితిని బీఆర్ అంబేద్కర్ కూడా ఆలోచించి ఉండరని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ బడ్జెట్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం మాత్రమే చేయగలరని, అయితే దానిపై తన అభ్యంతరం లేదా పరిశీలనలు ఇవ్వలేరని ఆప్ అధిష్టానం తెలిపింది. ఎల్జీ ఫైల్‌పై ఏదైనా రాస్తే అది రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఢిల్లీ బడ్జెట్ ఫైల్‌పై ఢిల్లీ ఎల్‌జీ మూడు రోజుల పాటు కూర్చున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎల్‌జీకి పదే పదే ఫోన్ చేసిన తర్వాతే ఫైల్ అందిందని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొన్ని గంటల తర్వాత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీని తన “అన్నయ్య” అని సంబోధించారు. కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి గొడవలు లేకుంటే ఢిల్లీ 10 రెట్లు అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ప్రధాని ఢిల్లీని గెలవాలంటే ముందుగా నగర ప్రజల హృదయాలను గెలుచుకోవాలని కేజ్రీవాల్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)