డిమాండ్లు సాధించిన మహారాష్ట్ర రైతులు !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో జరిగిన చర్చల అనంతరం మహారాష్ట్ర రైతులు ఆందోళన విరమించనున్నారు. ఈ మేరకు లాంగ్‌మార్చ్‌కు నాయకత్వం వహించిన సిపిఐ నేత ఎమ్మెల్యే జీవా పాండు గవిత్‌ తమ డిమాండ్లను సాధించినట్లు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమవుతుందని, తక్షణమే చర్యలు తీసుకోదని మేం భయపడ్డాం. కానీ ప్రభుత్వం రైతు డిమాండ్లను నెరవేర్చేవిధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అందుకే మేము ఆందోళన విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. రైతులందరూ వారి ఇళ్లకు తరలి వెళుతున్నారు' అని ఆయన అన్నారు. కాగా, రైతులు కోరుకుంటున్న విధంగా అటవీ హక్కులు, ఆక్రమణకు గురైన అటవీ భూములు, ఆలయ ట్రస్టులకు చెందిన భూములు, పోడు భూములును వ్యవసాయం చేసుకునేందుకు సాగుదారులకు బదలాయించడం వంటి 14 డిమాండ్లపై తాము రైతు ప్రతినిధి బృందంతో చర్చించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి షిండే తెలిపారు. సరుకు ధర తక్కువగా ఉండడం, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నందున ఉల్లి రైతులకు ఆర్థిక ఉపశమనంగా క్వింటాల్‌కు రూ. 350 అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్చల అనంతరం రైతులు ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)