అనుమానానికి బలైన తండ్రీకొడుకులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నగరంలో రంగస్వామినగర్‌కు చెందిన బేల్దారి మహమ్మద్‌ రఫీ (35), భానులు పన్నేండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇమ్రాన్‌ (9), సొహైల్‌ (6) కుమారులు. బేల్దారి పనులకు వెళ్తూ సంపాదించిన దాంతో సంతోషంగా జీవనం గడిపేవారు. రెండేళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. వారం కిందట భార్యతో గొడవపడి దాడి చేశాడు. గాయపడిన ఆమెను ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చేర్పించాడు. ఈనెల 28న సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలతో 'అమ్మ వద్దకు పోదాం రండి' అంటూ పిలుచుకొని సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య భాను అదేరోజు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు నగరంతో పాటు శివారులో గాలించారు. ఆచూకీ లభించలేదు. బుక్కరాయసముద్రం సమీపంలోని వాల్మీకి కల్యాణమండపం వెనుక భాగంలో చిక్కవడియార్‌ చెరువులో మూడు మృతదేహాలు నీటిపై తేలుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ ప్రసాదరెడ్డి, త్రీటౌన్‌, ఫోర్త్‌ టౌన్‌, శింగనమల సీఐలు కత్తి శ్రీనివాసులు, జాకీర్‌హుస్సేన్‌, అస్రార్‌బాషా ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీయించారు. ఈనెల 28న త్రీటౌన్‌ పరిధిలో అదృశ్యమైన తండ్రీ కొడుకులుగా గుర్తించారు. రఫీ తనతోపాటు ఇద్దరు కుమారుల నడుముకు తాడు కట్టుకుని చెరువులో దూకాడు. దీంతో ముగ్గురూ మృతి చెందారు. ప్యాంటు జేబులో ఓ కవర్‌లో బంగారు కమ్మలు, ముక్కుపుడక, లేఖ లభించాయి. భార్య ప్రవర్తన నచ్చలేదని, అయినవాళ్లు తననే నిందిస్తున్నారని, బతికి ఏం లాభం.. అందుకే నాతో వెళ్లిపోతున్నా.. నేను చనిపోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే తనతోపాటు తీసుకెళ్తున్నా' అని రాసుకున్నాడు. రఫీ అత్త షేక్‌ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)