పీఎం శ్రీ పథకానికి 9,000 పాఠశాలల ఎంపిక

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 9,000 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. త్వరలోనే ఆయా పాఠశాలల పేర్లను వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యా రంగంలో పలు సంస్కరణలతో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా పీఎం శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుంది. స్కూల్స్‌లలో ల్యాబ్ ఫెసిలిటీ, క్రీడా సామగ్రి, సిలబస్‌కు అనుగుణమైన డిజిటల్ తరగతి గదులు, ఆర్ట్ స్టూడియోస్‌లను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను పాఠశాలలు తీర్చిదిద్దాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని పెంపొందించి గ్రీన్ స్కూల్స్‌గా మార్చాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఎంపిక కావాలంటే స్కూల్ యాజమాన్యం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల ఫార్మాట్‌లో స్కూల్స్‌ను ఎంపిక చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా 2.5లక్షల దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యా సంస్థలు, నవోదయ పాఠశాలలు కూడా ఉన్నాయన్నారు. వీటిలో నుంచి 9,000 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. పథకానికి ఎంపిక చేసిన పాఠశాలలతో చాలా సంతృప్తిగా ఉన్నట్లు అధికారి తెలిపారు. త్వరలోనే స్కూల్స్ జాబితాను విడుదల చేస్తామన్నారు. వాస్తవానికి పీఎం శ్రీ పథకం కింద 14,500 స్కూల్స్‌ని డెవలప్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలల ఎంపికకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, వాటి వినియోగం; పెడాగజీ, కరిక్యులమ్, అసెస్‌మెంట్; హ్యూమన్ రీసోర్సెస్- లీడర్‌షిప్; జెండర్ ఈక్విటీ, ఇన్‌క్లూజివ్ ప్రాక్టిసెస్; మేనేజ్‌మెంట్, మానిటరింగ్, గవర్నెన్స్; బెనెఫిషియరీ సాటిస్‌ఫాక్షన్ విషయాలను తనిఖీ చేసి స్కూల్స్‌ని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలిపారు. పీఎం శ్రీ పథకంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాల్సి ఉందని సీనియర్ అధికారి చెప్పారు. ఏడు రాష్ట్రాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో ఎంవోయూ కుదుర్చుకోలేదని తెలిపారు. పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా , తమిళనాడు , జార్ఖండ్ , కేరళ , ఢిల్లీ ఇందులో చేరలేదు. దీంతో ఇప్పటికైనా ఒప్పందం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలను కోరినట్లు అధికారి తెలిపారు. దేశంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్‌కి పీఎం శ్రీ పథకం పాఠశాలలను కేరాఫ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఓ లేఖలో కేంద్రం కోరిందని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)